Ghee Roast Chicken Dosa Recipe : నూతన సంవత్సరాన్ని కొత్త డిష్‌తో ప్రారంభించాలనుకుంటే మీరు నెయ్యితో రోస్ట్ చేసిన చికెన్ దోశను ట్రై చేయవచ్చు. ఇది మీకు అదిరే టేస్ట్‌ని ఇవ్వడంతో పాటు.. మంచి అనుభూతిని ఇస్తుంది. దీనిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా దానికోసం ఉపయోగించే మసాల నుంచి.. డిప్ వరకు అన్ని మీరు సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి టేస్టీ దోశను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
నెయ్యితో రోస్ట్ చేయడానికి..
ఎండు మిర్చి - 125 గ్రాములు
ధనియాలు - 30 గ్రాములు
జీలకర్ర - 15 గ్రాములు
మెంతులు - 5 గ్రాములు
మిరియాలు - 5 గ్రాములు
లవంగాలు - 2
వెల్లుల్లి - 5 రెబ్బలు
పసుపు - చిటికెడు
చికెన్ మారినేట్ కోసం..
బోన్‌లెస్ చికెన్ - 500 గ్రాములు
పెరుగు - 50 గ్రాములు
నిమ్మకాయ - 1
చికెన్ వండేందుకు..
చింతపండు గుజ్జు - 20 గ్రాములు
అల్లం పేస్ట్ - 1టీస్పూన్
వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (సన్నగా తరుగుకోవాలి)
టమాట - 1 (సన్నగా తరుగుకోవాలి)
నెయ్యి - 50 గ్రాములు
కారం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
దోశ కోసం..
దోశ పిండి
చీజ్ - 120 గ్రాములు
నెయ్యి - దోశలకు సరిపడా
కొత్తిమీర - 1 కట్ట (సన్నగా తరుగుకోవాలి)
దోశకోసం స్పెషల్ చట్నీ (డిప్)
కరివేపాకు - 4 టీస్పూన్స్
పెరుగు - 100 మి.లీ
ఉప్పు - తగినంత
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
పంచదార - కొంచెం
కారం - అర టీస్పూన్
తయారీ విధానం..
ముందు గీ రోస్ట్ మసాలా సిద్ధం చేసుకోవాలి. చిన్న ఫ్రై పాన్ పెట్టి దానిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, లవంగాలు, వెల్లుల్లి, పసుపు వేసి డ్రై రోస్ట్ చేయాలి. మంచి సుగంధం వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అవి చల్లారిన తర్వాత మిక్స్‌లో వేసి పౌడర్ చేయాలి. దీనిని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ పొడి ఫ్రిడ్జ్‌లో కొన్నివారాల పాటు నిల్వ ఉంటుంది.
ఇప్పుడు చికెన్‌ను మారినేట్ చేసుకోవాలి. చికెన్‌ను బాగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ గంట ముందు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దానిలో నెయ్యి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దానిలో ఉల్లిపాయలు, టమాట ముక్కలు వేసి మగ్గనివ్వాలి. కరివేపాకు వేసి ఫ్రై చేసి.. పదార్థాలను మెత్తగా ఉడకనివ్వాలి. దీనిలో కాస్త నీరు పోసిన పర్లేదు కాని మెత్తగా ఉడకనివ్వాలి. మారినేట్ చేసిన చికెన్‌ని దీనిలో వేసి ఉడికించాలి. చికెన్ మెత్తగా అయ్యేవరకు బాగా ఉడికించాలి. చివర్లో చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి. ముందుగా రెడీ చేసుకున్న మసాలా మిక్స్ కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఉప్పును రుచికి తగ్గట్లు వేసి స్టౌవ్ ఆపేయాలి.
దోశ కోసం స్టవ్ వెలిగించి.. దానిపై దోశ పాన్ పెట్టాలి. దోశ బ్యాటర్ వేసి.. దానిపై చికెన్ ఫిల్లింగ్ వేయాలి. దోశ రోస్ట్ అయిపోతే.. వేడి గీ రోస్ట్ చికెన్ దోశ రెడీ. దీనిని మీరు పెరుగు డిప్లో ముంచి తినొచ్చు. పెరుగు డిప్ కోసం.. కరివేపాకును బాగా ఫ్రై చేయాలి. దానిని పెరుగులో వేసి బాగా కలపాలి. ఉప్పు, జీలకర్ర, పంచదారం, కారం వేసి స్మూత్‌గా వచ్చేవరకు కలపాలి. ఇది గీ రోస్ట్ చికెన్ దోశకు బెస్ట్ కాంబినేషన్ అవుతుంది.
Also Read : న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ బిర్యానీ.. రెసిపీ చాలా సింపుల్