New Year Special Chicken Biryani Recipe : మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్​ రానుంది. 2023కి బాయ్ చెప్తూ.. 2024కి వెల్​కమ్​ చెప్తూ చాలా మంది పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ చేసుకునే ఫెస్టివల్​గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటూ అందరినీ ఆహ్వానించి.. కొత్త సంవత్సరానికి వెల్​కమ్ చెప్తారు. మీరు కూడా అలా పార్టీని ప్లాన్ చేస్తున్నారా? మరి మీ మెనూలో చికెన్ బిర్యానీ ఉందా? లేదా?


పార్టీ అంటే చికెన్ ఉండాల్సిందే. ముఖ్యంగా చికెన్ బిర్యానీ ఉండాల్సిందే. మందు తాగేవారికే కాదు.. తాగని వారిలో కూడా చికెన్ బిర్యానీ అంటే మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఇలాంటి సెలబ్రేషన్ సమయంలో చికెన్ బిర్యానీ లేకుంటే ఎలా? హా ఏముంది రెస్టారెంట్​లో ఆర్డర్ చేసేద్దామనుకుంటున్నారేమో.. ఈ సమయంలో ఫుడ్ డెలీవరి చేయించుకోవాలంటే.. చాలా కష్టం. మీరు అక్కడికి వెళ్లి తినడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఆ వెయిట్ చేసేది ఏదో ఇంట్లో ఉండి.. నలుగురూ కలిసి.. వేడి వేడి చికెన్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్ చికెన్ బిర్యానీ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఓ లుక్​ వేసేయండి.


కావాల్సిన పదార్థాలు


చికెన్ - 400 గ్రాములు


పెరుగు - అరకప్పు


అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్


కారం - 1 టీస్పూన్


పసుపు - అర టీస్పూన్


గరం మసాలా - 1 టీస్పూన్


బిర్యానీ మసాలా - 1 టేబుల్ స్పూన్


ఉప్పు - రుచికి తగినంత


రైస్ - ఒకటిన్నర కప్పు


లవంగాలు - 3


బిర్యానీ ఆకు - 1


దాల్చిన చెక్క - 1 అంగుళం


యాలకులు - 2


ఉల్లిపాయలు - అరకప్పు (కట్​ చేసుకున్నవి)


నూనె - తగినంత


నీళ్లు - అవసరాన్ని బట్టి


కుంకుమ - గార్నిష్ కోసం


తయారీ విధానం


ముందుగా బియ్యాన్ని బాగా కడిగి.. నీటిలో ఓ అరగంట నానబెట్టండి. దానిలోని నీటిని వడబోసి పక్కన పెట్టుకోండి. చికెన్ మెరినేట్ చేయడం కోసం ఓ గిన్నె తీసుకోండి. దానిలో చికెన్ తీసుకుని బాగా కడగండి. చికెన్​లో పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, బిర్యానీ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలపండి. దీనిని కూడా ఓ అరగంట ఫ్రిజ్​లో ఉంచండి. ఇలా మెరినేట్ చేసుకోవడం వల్ల మసాలాలు చికెన్​కు పట్టి మంచి ఫ్లేవర్ ఇస్తాయి. 


ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకోండి. దానిలో నీటిని మరింగించి.. నానబెట్టిన బియ్యాన్ని వేయండి. దానిలోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కాస్త ఉప్పు వేసి బాగా కలపండి. దాదాపు 80 శాతం బియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి నీటిని వంపేయాలి. ఇప్పుడు మందపాటి కడాయి తీసుకుని దానిలో మారినేట్ చేసుకున్న చికెన్​ను వేయండి. దానిపైన తరిగిన టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు వేయండి. అనంతరం 80 శాతం ఉడికించుకున్న రైస్​ను లేయర్​గా వేయండి. పై నుంచి కాస్త నూనె లేదా నెయ్యి వేయొచ్చు.


సువాసన, రుచికోసం కుంకుమపువ్వుల నీటిని జోడించవచ్చు. ఇది మీకు మంచి రంగు, రుచిని ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. కడాయిపై మూతపెట్టి.. సిమ్​లో దానిని 20 నిముషాలు ఉడికించండి. దానిలోని ఆవిరి బయటకు రాకుండా మూతపై ఏదైనా బరువు ఉంచండి. 20 నిమిషాల తర్వాత మీరు వేడి వేడి చికెన్ బిర్యానీని ఆస్వాదించవచ్చు. దీనిని కేవలం కర్రీతోనే కాదు.. నార్మల్​గా కూడా లాగించేయవచ్చు. రైతాతో కూడా ఇది మంచి రుచిని అందిస్తుంది. 


Also Read : న్యూ ఇయర్​ కోసం క్యారెట్ వాల్​నట్ బర్ఫీ.. ఇంట్లోనే సింపుల్​గా చేసేయొచ్చు