Himachal Pradesh Electric Vehicles : హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పెట్రోలు (Petrol), డీజిల్ (Diesel)వాహనాలు కొనవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే అన్ని ప్రభుత్వ శాఖలు పెట్రోలు, డీజిల్ తో నడిచే వాహనాలకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. పర్యావరణ రక్షణ కోసం డీజిల్, పెట్రోల్ వాహనాలకు దూరంగా ఉండాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్ కోసం అందరూ కలిసి రావాలని కోరారు. ఏ ప్రభుత్వ శాఖలో అయిన పెట్రోల్ లేదా డీజిల్ వాహనం కొనుగోలు చేయాలని భావిస్తే...రాష్ట్ర కేబినెట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 


రవాణా శాఖలో వందశాతం ఎలక్ట్రిక్ వాహనాలు
హిమాచల్ ప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు భారీగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు ఈ-వాహనాలు 2,733 ఉంటే, ప్రభుత్వ ఈ-వాహనాల సంఖ్య 185 మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలతో పోల్చితే..ప్రభుత్వ ఈ వాహనాలు కనీసం పది శాతం కూడా లేదు. పర్యావరణాన్ని రక్షించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచేందుకు...పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోలుపై ఆంక్షలు విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల కంటే ముందుగానే...రవాణా శాఖ డీజిల్, పెట్రోల్ వాహనాలను పక్కన పెట్టేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలతో నింపేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు రవాణా శాఖను అనుసరించి...ఈ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకే సారి ఈ-వెహికల్స్ మార్చడం కాకుండా దశల వారిగా మార్చాలని సీఎం సుఖు సూచించారు. ఇది 2024 ప్రారంభం నుంచే అమలు కావాలని ఆదేశించారు. 


భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే
భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదేనని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేలా కేంద్ర ప్రభుత్వం వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సోలార్‌, పవన విద్యుత్‌ ఆధారిత ఛార్జింగ్‌ మెకానిజంను ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఢిల్లీ-జైపుర్ మధ్య మొదటి ఎలక్ట్రిక్‌ హైవేను అభివృద్ధి చేస్తోంది. విదేశీ తరహాలో దేశంలో మొదటిసారిగా జాతీయ రహదారుల వెంట ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీ రాబోతోంది. ఇకపై హైవేలో వెళ్లే భారీ వాహనాలు విద్యుత్ సాయంతోనే నడవనున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ హైవేలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. రైళ్లు, మెట్రో ట్రెయిన్లు ఎలా కరెంటుతో నడుస్తున్నాయో అలాగే హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పరుగులు పెట్టనున్నాయి.