వైద్య పరిజ్ఞానం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంతక ముందు క్యాన్సర్ అంటే అమ్మో.. అది వస్తే చనిపోవడమే అని అనుకునే వాళ్ళు. తర్వాత దానికి చికిత్స వచ్చింది. ఎటువంటి క్యాన్సర్ అయిన ప్రాథమిక దశలోనే కనుక్కొని చికిత్స చేసి నయం చేయగలరు అనే నమ్మకం వచ్చింది. రకరకాల క్యాన్సర్ లకి పలు రకాల పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేసే వాళ్ళు. ఇక నుంచి ఆ అవసరం లేదు. ఇప్పడు మరో అడుగు ముందుకు పడింది. ఇప్పడు ఒక పరీక్షతోనే నాలుగు రకాల క్యాన్సర్ లని గురించే విధంగా శాస్త్రవేత్తలు కొత్త పరీక్షని అభివృద్ధి చేశారు.


ఈ  పరీక్షలో ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్ కి దారి తీసే కణాల మార్పులని ఖచ్చితంగా పరీక్షించవచ్చు. ఇది కొన్ని ఇతర క్యాన్సర్ లకి కారణమైన DNAని కూడా గుర్తించగలదు. అంటే భవిష్యత్తులో రొమ్ము, గర్భం, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లను ముందస్తుగా పరీక్షించవచ్చు. గర్భాశయ క్యాన్సర్ కోసం పరీక్షించినప్పుడు చికిత్సకు అవసరమైన అధునాతన కణ మార్పులతో ఉన్నవారిని గుర్తించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతుల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) ఉన్నవారిలో రాబోయే నాలుగు సంవత్సరాలలో కణాల మార్పులను కలిగి ఉన్న 55 శాతం మంది వ్యక్తులను ఇది గుర్తించింది.


ఈ అధ్యయనం కోసం నిపుణులు DNA మిథైలేషన్‌ను పరిగణలోకి తీసుకున్నారు. ధూమపానం,కాలుష్యం, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, అధిక బరువు వంటి కారకాల ద్వారా వచ్చే మార్పులని ఈ అధ్యయనంలో గుర్తించారు. DNA మిథైలేషన్‌ను నిశితంగా పరిశీలించడం ద్వారా శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ను గుర్తించగలరు. భవిష్యత్తులో ఎవరైనా క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అధ్యయనం కోసం 1254 గర్భాశయ స్క్రీనింగ్ నమూనాలు పరిశీలించారు. హెచ్ పివి ఉన్న మహిళలు గర్భాశయంలో మార్పులు ఉన్న, లేని మహిళల నుంచి కూడా నమూనాలు తీసుకున్నారు.


గర్భాశయ నమూనాలు పరీక్షించడం ద్వారా సదరు స్త్రీకి మరో మూడు ప్రధాన క్యాన్సర్ల ప్రమాదం కూడా గుర్తించవచ్చు. ఇప్పటికే క్యాన్సర్ ని కనుగొనేందుకు స్క్రీనింగ్ ప్రోగ్రామ్, ఇతర టెస్టుల ద్వారా తెలుసుకుంటున్నారు. మరింత అధునాతన రీతిలో పరీక్షలు జరిపి ఇతర క్యాన్సర్లు గురించి ముందుగా తెలుసుకోవడం చాలా స్వాగతించదగ్గ విషయం అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ ని ముందస్తుగానే తెలుసుకుంటే దాన్ని నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కొత్త పద్ధతి మరింత నిర్ధిష్టమైనది. గర్భాశయ క్యాన్సర్ నివారణకి ఇది ఉపయోగపడుతుంది.


మహిళలు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళే. అయితే దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి నిపుణులు వివరించారు. గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) అందరిలో ఉండదని ఇది అరుదుగా కొంతమందిలో మాత్రమే ఉంటుందని అపోహ ఉంటుంది. వాస్తవానికి 5 లో నలుగురికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ వైరస్ బయటపడుతుంది. అయితే రోగనిరోధక వ్యవస్థ మనకి తెలియకుండా ఈ హెచ్ పివిని తొలగిస్తుంది. HPV వ్యాక్సిన్‌ తీసుకుంటే కనీసం 70 శాతం గర్భాశయ క్యాన్సర్‌ల నుంచి బయటపడే అవకాశం ఉంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: దోమలు బాగా కుడుతున్నాయా? బ్లడ్ గ్రూప్ వల్ల కాదు, అసలు కారణం వేరే ఉంది!