ర్షాకాలం వచ్చిందంటే దోమలు దండయాత్ర మొదలు పెట్టేస్తాయి. తేమ వాతావరణం వల్ల అవి ఎక్కువగా వేడిని కోరుకుంటాయి. దోమలు కొంతమందినే ఎక్కువ కుట్టేస్తూ ఉంటాయి. మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని కుట్టకుండా మనల్నే కుడుతుంటే.. వీటికి మన రక్తం బాగా రుచిగా ఉందేమో అని అనుకుంటారు. కానీ అవి కేవలం కొంతమందినే ఆకర్షించేందుకు వేరే కారణాలు ఉన్నాయి. శరీర వేడి, వాసనని బట్టి అవి ఎక్కువగా కుట్టేస్తాయి. మీరు కూడా ఇప్పుడు దోమలకి అయస్కాంతంగా మారిపోయారా? అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూసేయండి.


దోమలు ఎక్కువగా కొందరినే కుట్టడానికి గల కారణాల మీద ఒక ఇంట్రెస్టింగ్ అధ్యయనం బయటకి వచ్చింది. న్యూయార్క్ లోని రాక్ ఫెల్లర్ విశ్వవిద్యాలయం, మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్, కవ్లీ న్యూరల్ సిస్టమ్స్ ఇన్‌స్టిట్యూట్, హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌ల పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ఇది. దోమలకి అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులుగా మారే వారి చర్మంపై అధిక స్థాయిలో కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి దోమలని విపరీతంగా ఆకర్షించుకుంటాయి. ఈ ఆమ్లం మీ శరీరం మీద కూడా ఉంటే జీవితాంతం మీరు దోమల అయస్కాంతంగా మారిపోయినట్టే.


ఈ అధ్యయనం ఎలా చేశారు?


కొంతమందినే దోమలు ఎక్కువగా ఎందుకు కూడతాయో ఈ అధ్యయనం ద్వారా రుజువైంది. అందరినీ కాకుండా నన్నే ఈ దోమలు ఎందుకు కుడుతున్నాయని మనలో చాలా మందికి వచ్చే ప్రశ్న. ఇదే ఈ సరికొత్త అధ్యయనానికి పునాది వేసింది. సుమారు 64 మందిని పరీక్షించిన తర్వాత ఈ నివేదిక రూపొందించారు.


మానవ చర్మ వాసన, దోమల మీద పరిశోధన


ప్రతి ఒక్కరి శరీరానికి ఒక వాసన ఉంటుంది. అది అందరికీ ఒకే విధంగా ఉండదు. అదే దోమలని ఆకర్షించేందుకు కారణం అయింది. ఒక వ్యక్తి శరీర వాసన దోమలని ఆకర్షించడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ స్థాయిలో కార్బాక్సిలిక్ యాసిడ్ ఉత్పత్తి చేసే చర్మం కలిగిన వ్యక్తులు తక్కువ ఉత్పత్తి చేసే వారి కంటే దోమలను ఎక్కువగా ఆకర్షిస్తున్నారని వారు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు తమ ప్రత్యేక సువాసన గ్రహించేందుకు ఆరు గంటల పాటు తమ చేతులపై నైలాన్ స్టాకింగ్స్(పల్చని పొర లాంటి తొడుగు) ధరించారు. తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దోమలు ఉంచిన కంటైనర్లలో వేశారు. ఆ దోమలు ఆ సువాసనకి కదలకుండా అలాగే ఉండిపోయాయి.


జంతువులతో పోల్చినప్పుడు మానవులు అధిక మొత్తంలో కార్బాక్సిలిక్ యాసిడ్‌ను విడుదల చేస్తారు. అందుకే దోమలు మనుషుల్ని ఆకర్షించేందుకు పెద్ద కారణంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఆహారం లేదా అలవాట్లు మారినప్పటికి ఉత్పత్తి చేయబడే కార్బాక్సిలిక్ యాసిడ్ స్థాయిలు మాత్రం మారడం లేదు. అందుకే దోమలు ఇటువంటి వాళ్ళని ఎక్కువగా కరిచేస్తున్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు దోమలు కార్బాక్సిలిక్ యాసిడ్‌ను ఎందుకు ఇష్టపడతాయనే దాని గురించి పరిశోధనలు చేస్తున్నారు.


శరీర వాసనే కాదు ఇతర కారణాలు కూడా దోమలు ఆకర్షిస్తాయనే విషయం గురించి కూడా అధ్యయనంలో ప్రస్తావించారు. ఒక అధ్యయనం ప్రకారం మీ బ్లడ్ గ్రూప్ కూడా ఒక కారణమని శాస్తవేత్తలు తేల్చి చెప్పారు. అలాగే శరీరం వాసనతో పాటు రంగు, శరీర వేడి, మద్యం వాసనకి కూడా ఆకర్షితులుగా మారతాయి. చర్మ ఉష్ణోగ్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడే దోమలు కూడతాయి. అధికంగా చేతులు, కాళ్ళపై కుడతాయి. మరి మీరు కూడా దోమల అయస్కాంతం అయితే వాటి నుంచి కాపాడటం కాస్త కష్టమేనండోయ్.   


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: వెల్లుల్లిలో ఎన్ని రంగులు ఉన్నాయో తెలుసా? వాటిలో ఆరోగ్యానికి ఏది మంచిది