Paracetamol Side Effects : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మందులలో పారాసెటమాల్​ ఒకటి. దీనిని ఇండియాలో కూడా ఎక్కువగా తీసుకుంటారు. అమెరికాలో అత్యధికంగా ఉపయోగించే మందులలో ఇది కూడా ఒకటి. కొన్నిరకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్​గా ఉపయోగించే ఈ పారాసెటమాల్​.. నొప్పిని తగ్గించడమే కాదు.. మానసిక సమస్యలను పెంచుతుందని మీకు తెలుసా? రీసెంట్ అధ్యయనాలు ఇవే ఫలితాలను ఇచ్చాయి. అవును తలనొప్పిని తగ్గించేందుకు వేసుకునే ఈ పెయిన్ కిల్లర్ మానసిక సమస్యలను పెంచుతుందట. 

ప్రతికూల భావోద్వేగాలు

పారాసెటమాల్ ప్రజల ప్రవర్తనలో మార్పులను తెచ్చి.. మానసిక సమస్యలను పెంచుతుందని తాజా అధ్యయనం తెలిపింది. సెటామినోఫెన్, టైలెనాల్, పనాడోల్ బ్రాండ్​ పేర్లతో ఎక్కువగా అమ్ముడవుతోన్న పారాసెటమాల్​పై 2020లో ఓ అధ్యయనం చేశారు. దాని ఫలితాల్లో అసాధారణ విషయాలను నిపుణులు కనుగొన్నారు. ఈ మెడిసన్​ను తీసుకున్నవారిలో ప్రతికూల భావోద్వేగాలు పెంచుతున్నట్లు గుర్తించారు. పారాసెటమాల్​ తీసుకున్నవారికి బాధ కలిగించే భావాలను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల రిలీఫ్ అనిపిస్తుంది. అయితే ఇది అభిజ్ఞా విధులను కూడా మందగించేలా చేస్తే రిస్క్ పెంచుతుంది. 

ఎసిటమినోఫెన్ సంభావ్య ముప్పులకు మెదడు ప్రతిస్పందనను మొద్దుబారేలా చేస్తుందని గుర్తించారు. దీనివల్ల రిస్క్ తీసుకునే అవకాశం పెరిగిపోతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎసిటమినోఫెన్ తీసుకున్నవారిలో వర్చువల్ బెలూన్ పంపింగ్ చేయడం వంటి ప్రమాదాలను పెంచుతున్నట్లు గుర్తించారు. దశాబ్ధాలుగా దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నా.. గతంలో అనుకున్నదానికంటే మెదడుపై మరింత నెగిటివ్ ప్రమాదాలను చూపిస్తుందని ఈ అధ్యయనం చెప్పింది. 

పారాసెటమాల్ మరణాల ప్రమాదం, హృదయ సంబంధ, జీర్ణశయాంతంర సమస్యలతో కూడా ముడిపడి ఉందని అధ్యయనంలో తేలింది. దీనిపై సైన్స్ అలర్ట్ నివేదిక ఇచ్చింది. నొప్పి తగ్గింపుపై ఉండాల్సిన ఎసిటమినోఫెన్ ప్రభావాలు.. మానసిక ప్రక్రియలపై విస్తరించి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపింది. అమెరికాలో దీనిని దాదాపు 25 శాతం జనాభా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి దీనిపై అవగాహన తగ్గడం, రిస్క్ తీసుకోవడం పెరుగుతుందని తెలిపారు. 

వైద్యుల సలహా లేకుండా దీనిని తీసుకోవడం ఆపేస్తే మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే కొందరు వైద్యుల సలహా లేకుండానే ఈ మెడిసన్​ను తీసుకుంటూ ఉంటారు. మీరు ఇలా తీసుకునేవారు అయితే కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నొప్పిని తగ్గించుకునేందుకు వేసుకునే ఏ పెయిన్ కిల్లర్ అయినా.. తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.