ప్రస్తుత పరిస్థితుల్లో గుండెని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా గుండె ప్రమాదంలో పడి... చిన్న వయస్సులోనే గుండె పోటు రావడం జరిగి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇటువంటి తరుణంలో అందరూ గుండె గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రక్తపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, అధిక కొలెస్ట్రాల్ లేదా పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి ఏదైనా కావచ్చు.. ఇలా వివిధ వ్యాధులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ వాటి నుంచి బయటపడాలంటే అందుకు సరైన ఆహారపు ఎంపికలు చేసుకుంటే దీర్ఘాయువు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?


గుండెని కాపాడుకుంటూ దీర్ఘాయువు పొందటానికి శాస్త్రీయంగా అనేక  ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆహార ఎంపికలు. సమతుల్య ఆహారం తీసుకుంటే గుండె పరిస్థితులని చక్కగా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో ఎక్కువగా మొక్కల ఆధారిత పదార్థాలు చేర్చుకోవడం, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వు మూలాలు హృదయ సంబంధ వ్యాధులని నిరోధించేందుకు గొప్ప మార్గం అని పలు పరిశోధనలు పేర్కొన్నాయి.


పరిశోధన ఇలా..


అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో ప్రచురించిన విశ్లేషణ ప్రకారం దాదాపు 905 మంది 67 సంవత్సరాలు వయస్సు కలిగిన గుండె జబ్బు రోగులని పరిశీలించారు. 2.4 సంవత్సరాల పాటు వారిని పరిశీలించారు. ఆ వ్యవధిలో 140 మంది రోగులు వివిధ కారణాల వల్ల మరణించారు. వారిలో 85 మంది గుండె జబ్బుల కారణంగా చనిపోయారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తిన్న వాళ్ళు గుండె వైఫల్యం సమస్య ఎదుర్కొంటూ హాస్పిటల్స్ లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని కనుగొన్నారు. వాళ్ళు ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు, ఒమేగా 3 ఆమ్లాలు తీసుకుంటున్నట్టు తేలింది.


గుండెకి అత్యంత ఆరోగ్యకరమైన కొవ్వులు


గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు అసంతృప్త కొవ్వులు, మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా 3 ఉన్న పదార్థాలు ఎంపిక చేసుకోవడం ఉత్తమం.


ఒమేగా 3 ఆమ్లాలు ఎక్కువగా ఉండే పదార్థాలు


⦿ వాల్ నట్స్


⦿ కిడ్నీ బీన్స్


⦿ చియా విత్తనాలు


⦿ సోయాబీన్ నూనె


⦿ ఆలివ్ నూనె


⦿ జనపనార విత్తనాలు


⦿ అవిసె గింజలు


ఈ ఆహారాలు పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే మొక్కల ఆధారిత వనరులు. ఈ ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన బలమైన గుండెని ఇవ్వడంతో పాటు బరువును అదుపులో ఉంచుతాయి. మెరుగైన జీవక్రియ ఏర్పడేలా చేస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెజబ్బులని నివారిస్తాయి. ఇక మాంసాహారులు అయితే సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి సముద్రపు ఆహారాలు తీసుకోవచ్చు. ఇవే కాకుండా సలాడ్, ఓట్ మీల్, స్మూతీస్ చేసుకునేటప్పుడు వాటిలో గింజలు లేదా విత్తనాలు జోడించుకోవచ్చు.


సరైన డైట్ పాటించడం వల్ల గుండెని పదిలంగా కాపాడుకోవచ్చు. వాటితో పాటు కంటి నిండా నిద్ర, మానసిక ప్రశాంతత కూడా ముఖ్యం. ఒత్తిడి దూరం చేసుకునే విధంగా యోగా, ధ్యానం, క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయడం అవసరమే.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: చలికాలంలో జామ పండు తింటే డాక్టర్‌తో పనే ఉండదు, ఎందుకంటే..