కొత్తగా తల్లి అయిన మహిళలు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారనే విషయం సహజంగా వింటూనే వింటాం. అయితే బాలింతల్లో నిద్రలేమి దీర్ఘకాలంలో ముప్పుగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ యూనివర్సిటీకి (యూసీఎల్ఏ) చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. బాలింతల్లో నిద్రలేమి కారణంగా దీర్ఘ కాలంలో ఆయుష్షు తగ్గుతోందని వారు గుర్తించారు.
యూసీఎల్ఏ పరిశోధకులు ఈ అధ్యయనం కోసం మొత్తం 33 మంది తల్లులను పరిశీలించారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చిన ఏడాది కాలం వరకు పరిశోధన జరిపారు. తల్లుల బ్లడ్ శాంపిల్స్ నుంచి డీఎన్ఏ సేకరించి ఈ ఫలితాలను రాబట్టారు. ఆరు నెలల పాటు రాత్రి వేళలో 7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయిన తల్లుల డీఎన్ఏను.. 7 అంత కంటే ఎక్కువ సమయం నిద్రపోయిన తల్లుల డీఎన్ఏతో పోల్చి చూశారు. ఈ పరిశోధనలో 7 గంటల కంటే తక్కువ సేపు నిద్ర పోయిన వారి వయసు (బయోలాజికల్) 3 నుంచి 7 ఏళ్లు ఎక్కువగా కనిపించినట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు.
Also Read: బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే అంత ప్రమాదమా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోయే తల్లుల తెల్ల రక్త కణాలలో టెలోమీర్‌లు (telomeres) సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ టెలోమీర్‌లు శరీరానికి రక్షణ కవచాల్లా పనిచేస్తాయని.. వీటి సంఖ్య తగ్గడం వల్ల క్యాన్సర్, హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. టెలోమీర్‌ల సంఖ్య తగ్గితే త్వరగా చనిపోయే ముప్పు కూడా ఉందని పేర్కొన్నారు.
బాలింతల్లో నిద్రలేమి శారీరక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని యూసీఎల్ఏ జార్జ్ ఎఫ్ సోలోమెన్‌కు చెందిన సైకోబయాలజీ ప్రొఫెసర్ జూడిత్ కారోల్ వెల్లడించారు. రాత్రి పూట 7 గంటల కన్నా తక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని అన్నారు. బిడ్డ సంరక్షణ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో నిద్రలేమి సమస్య వస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
తమ పరిశోధన ఫలితాల వల్ల బాలింతలకు మేలు కలుగుతుందని భావిస్తున్నట్లు యూసీఎల్ఏలో సైకాలజీ, సైకియాట్రీ ప్రొఫెసర్ క్రిస్టిన్ డంకెల్ అన్నారు. బాలింతల ఆరోగ్యం విషయంలో కుటుంబం మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. చిన్నారుల సంరక్షణ బాధ్యతలను భర్త, ఇతర కుటుంబసభ్యులతో పంచుకుని, బాలింతలు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. ఈ అధ్యయన వివరాలు స్లీప్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Also Read: Male Contraceptive Pills: మగవారి కోసం ఆ మాత్రలు వచ్చేస్తున్నాయి... ఇక మహిళల ఆరోగ్యం భద్రం...