వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగు రోజుల కిందట సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు విజయసాయిరెడ్డితో పాటు సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే  ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ పూర్తయింది. తీర్పు నెలాఖరులో రావాల్సి ఉంది. 


విజయసాయిరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓ సీబీఐ అధికారిని హైదరాబాద్ జాయింట్ డైరక్టర్‌గా నియమించబోతున్నారని తెలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆయనను నియమించవద్దని కోరారు.  ఎందుకంటే ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు చేసిన అధికారి అని కారణం చెప్పారు. కారణం ఏదైనా అప్పట్లో ఆ అధికారిని కేంద్రం హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా నియమించలేదు. అప్పట్లో ఆయన రాసిన లేఖను ఇప్పుడు బెయిల్ రద్దు కోసం షరతుల ఉల్లంఘన కింద రఘురామకృష్ణరాజు కోర్టుకు సమర్పించారు. ఇది విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అని పిటిషన్‌లో తెలిపారు. 


అదే సమయంలో అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా మళ్లీ నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల విషయంలోనూ విజయసాయిరెడ్డి కోర్టకు ఉద్దేశాలు ఆపాదించే మాటలు మాట్లాడారని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను కూడా కించపర్చడం.. ఉద్దేశాలు ఆపాదించడం బెయిల్ షరతుల ఉల్లంఘనగానే రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. అలాగే ఎంపీ హోదాలో   కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా విజయసాయిరెడ్డి కలుస్తూ.. కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయని సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


రఘురామ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సీబీఐకి కూడా నోటీసులు జారీచేసింది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేశారు. దానిపై తీర్పు 25వ తేదీన వెల్లడి కానుంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌లో వాదనలు వినిపించడానికి సీబీఐ సుముఖత వ్యక్తం చేయలేదు. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు సూచించింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో సీబీఐ ఎలాంటి కౌంటర్ వేస్తుందన్నది రాజకీయ వర్గాలకు ఉత్కంఠ రేపుతోంది. కొద్ది రోజులుగా రఘురామకృష్ణరాజుపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రపతి సహా అందరికీ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు .. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని .. బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేస్తానని ప్రకటించి అదే పని చేశారు.