అసలైన నాటుకోడి కూర తినాలంటే గ్రామాలకే వెళ్లాలి. పట్టణాల్లో దొరికేది అధికశాతం బ్రాయిలర్ మాంసమే. నాటుకోడి కూడా దొరుకుతుంది కానీ దీన్ని వండే విధానం మాత్రం బ్రాయిలర్ కోడి మాంసాన్ని వండినట్టే ఫాలో అవుతున్నారు. దాని వల్ల నాటు కోడి పులుసు అసలైన రుచిని మిస్ అవుతారు. కంట్రి చికెన్ కర్రీ బావుండాలంటే రెసిపీ కాస్త విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ మేము నాటుకోడి పులుసు ఎలా చేయాలో చెప్పాం. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది. 


కావాల్సిన పదార్థాలు
మొదటగా మారినేషన్ కోసం...
నాటుకోడి మాంసం - అరకిలో
ఉప్పు - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
పసుపు - అరస్పూను
నిమ్మరసం - అర టీస్పూను


నాటుకోడి కూర మసాలా కోసం...
కొబ్బరిపొడి - ఒక టీస్పూను
గసగసాలు - ఒక టీస్పూను
దాల్చిన చెక్క ముక్కలు - రెండు
ధనియాలు - ఒక స్పూను
లవంగాలు - నాలుగు


ఇగురు కోసం 
ఉల్లిపాయల తరుగు - అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను
పచ్చిమిర్చి - మూడు 
పసుపు - అర స్పూను
నూనె - తగినంత
కరివేపాకు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒకటిన్నర స్పూను
కొత్తిమీర తరుగు - పావు కప్పు


తయారీ ఇలా...
1. ముందుగా చికెన్ శుభ్రంగా చేసుకుని అందులో పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం, ధనియాల పొడి వేసి బాగా కలపి, రెండు గంటలు పక్కన పెట్టేయాలి.దీన్నే మారినేషన్ అంటారు. 


2. ఇప్పుడు మసాలా తయారుచేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇందు కోసం కళాయిలో ధనియాలు,లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. 


3. అలాగే గసగసాలు, కొబ్బరి పొడి కూడా వేయించాలి. వాటన్నింటినీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. 


4. ఇప్పుడు కూర వండడం మొదలుపెట్టాలి. బ్రాయిలర్ కోడితే పోలిస్తే నాటుకోడి ముక్కలు గట్టిగా ఉంటాయి. కాబట్టి కుక్కర్లో వండితే సులువవుతుంది. 


5. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లి తరుగు, నిలువుగా కోసిన పచ్చి మిర్చి వేయించాలి. కాస్త ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి. 


6. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి. 


7. ఇప్పుడు మారినేషన్ చేసిన చికెన్ ను కూడా వేసి గా కలపాలి. కరివేపాకులు వేయాలి. 


8. సాధారణ మూత పెట్టేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. 


9. మూత తీసి ముందుగా పొడి చేసుకున్న మసాలాను, కారాన్ని, ఉప్పును వేసి బాగా కలపాలి. 


10. రెండు గ్లాసుల నీళ్లు కూడా వేసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. 


11. అయిదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. 


12. తరువాత మూత తీసి కొత్తి మీర చల్లుకోవాలి. టేస్టీ నాటుకోడి కూర రెడీ అయినట్టే. 
 


Also read: ఆవ పెట్టి పనసపొట్టు కూర ఇలా వండితే వదలకుండా తినేస్తారు, రెసిపీ ఇదిగో


Also read: స్పైసీగా కొత్తిమీర పచ్చడి, వేడి వేడి అన్నంతో తింటే అదిరిపోతుంది