ప్రశ్న: మాకు పెళ్లయ్యి రెండు సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ పిల్లలు లేరు. మా రెండు కుటుంబాల వారు మాకు ఎప్పుడు పిల్లలు పుడతారా అని ఆశగా చూస్తున్నారు. మా ఇద్దరికీ మాత్రం ఇప్పుడే పిల్లలు కావాలని అనుకోవడం లేదు. అందుకే మాకు ఒక మూడో తోడును తెచ్చుకోవాలి అనుకున్నాము. అలా ఓ కుక్కపిల్లను కొని పెంచుకుంటున్నాము. ఆ కుక్కపిల్ల వచ్చినప్పటి నుంచి నా భార్య ప్రవర్తన మారిపోయింది. ఆమె ఉద్యోగం చేస్తోంది. కానీ ఆమెకు ఉద్యోగం కన్నా, నాకన్నా ఆ కుక్క పిల్లనే ముఖ్యం అయిపోయింది. ఎప్పుడూ దాని బాగోగులు చూస్తూ దానితోనే రోజంతా గడపడానికి ఇష్టపడుతోంది. నాకు పంచాల్సిన ప్రేమను కూడా ఆ కుక్కపిల్లకే పంచుతోంది. రాత్రి సమయంలో కూడా దాన్ని మా ఇద్దరి మధ్యనే పడుకోబెడుతోంది. ఈ కుక్క పిల్ల వల్ల మేం బయటికి వెళ్లడం కూడా మానేశాం. నిజానికి మాది ఉమ్మడి కుటుంబం. మేం బయటికి వెళ్లినా కూడా ఆ కుక్క పిల్లను ఎవరో ఒకరు చూస్తారు. కానీ నా భార్య ఆ కుక్కకు తానే అన్నీ చేయాలనుకుంటోంది. దీనివల్ల మా మధ్య దూరం కూడా పెరిగింది. కుక్క పిల్ల కారణంగా నేను నా భార్యకు విడాకులు ఇవ్వలేను. నా వివాహ బంధాన్ని కాపాడుకోవాలి. నా భార్య ప్రేమను మళ్లీ పొందాలి. నేను ఏం చేయాలో చెప్పండి.


జవాబు: మీది ఒక విచిత్రమైన సమస్య. నిజానికి ఇంట్లో ఒక కుక్కను పెంచుకోవడం అనేది ఆ ఇంట్లో వారంతా ప్రేమ మూర్తులని సూచించే సంకేతం. తమకు చెందని ఒక ప్రాణిని ప్రేమగా పెంచుకుంటున్నారంటే సంతోషకరమైన జీవనానికి కూడా అది సంకేతంగానే చెప్పుకుంటారు. కానీ మీ పరిస్థితి భిన్నంగా ఉంది. మీ భార్యకు కుక్క కుటుంబంలో మనుషులు కన్నా ఎక్కువైపోయిందని అర్థం అవుతుంది. మీ భార్య కుక్కపట్ల చాలా ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల మీరు ఆమెకు దూరమవుతున్నారు. కుక్కలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. వాటి ద్వారానే అవి యజమానులను తమకు దాసోహం చేసుకుంటాయి. మనం గుప్పెడు ప్రేమను అందిస్తే, అవి ఆకాశమంతా ప్రేమను తిరిగి ఇస్తాయి. అందుకే కుక్కలకు ఎక్కువ మంది యజమానులు దాసోహం అయిపోతారు. మీ భార్య కూడా అలానే కుక్కే ప్రాణంగా బతుకుతోంది. దీనికి మీరు బాధపడడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఆమె బాటలోకి మీరు వెళ్లిపోతే సంతోషంగా బతుకుతారు.


ఆమెతో పాటు మీరు కూడా ఆ కుక్కను ప్రేమగా చూడడం మొదలు పెట్టండి. మీ భార్య ఆ కుక్కకు ఆహారం పెడుతుంటే మీరు కూడా సాయం చేయండి. ఆమె కుక్క కోసం చేసే ప్రతి పనిలోనూ మీరు భాగస్వాములు అవ్వండి. అప్పుడు మీ భార్యకు కొంత సమయం ఆదా అవుతుంది.ఆ సమయం మీకు కేటాయించే అవకాశం ఉంది. మీరిద్దరూ కలిసి వాకింగ్‌కి వెళ్ళినప్పుడు కుక్కను కూడా మీతో పాటు తీసుకెళ్లండి. వివాహ బంధాన్ని కాపాడుకోవడం కోసం మీరు కొన్నాళ్లు పాటు కుక్కకు సేవలు చేయక తప్పదు. కేవలం దాని కారణంగా మీ ఇద్దరు గొడవలు పడడం సరికాదు. ముఖ్యంగా మీరిద్దరూ బిడ్డ కోసం ప్లాన్ చేయడం చాలా ముఖ్యం. బిడ్డ ఉంటే మీ కుటుంబం పై మీ భార్య శ్రద్ధ వహించేలా చేస్తుంది. పిల్లల్ని వాయిదా వేయడం వల్ల... ఇలా క్యూట్ గా కనిపించే ప్రాణిపై మీ భార్య అధిక శ్రద్ధ చూపించడానికి కారణం కావచ్చు. వీలైనంతవరకు మీరు త్వరగా తల్లిదండ్రులు అవ్వడానికి ప్రయత్నించండి. సమస్య సమసి పోయే అవకాశం ఉంది. 



Also read: కాళ్లు, చేతులలో ఈ లక్షణాలు కనిపిస్తే మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నట్టే










































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.