అధిక కొలెస్ట్రాల్... ఒక సైలెంట్ కిల్లర్. నిశ్శబ్దంగా రక్తనాళాల్లో పేరుకుపోతుంది. ఇది పేరుకుపోయే క్రమంలో ఎలాంటి లక్షణాలను చూపించదు. ప్రాథమిక దశలో శరీరాన్ని ఏమాత్రం ఇది ప్రభావితం చేయదు. అధిక మొత్తంలో పేరుకు పోయాకే లక్షణాలు కనబడడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలు కనిపిస్తే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరిందని అర్థం చేసుకోవాలి.


కాళ్లు భారంగా...
కాళ్లు చాలా భారంగా అనిపిస్తాయి. నొప్పి కూడా పెడుతూ ఉంటాయి. ఇలా జరిగిందంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేయించుకోవడం ఉత్తమం. తొడల భాగంలో అధికంగా భారంగా అనిపిస్తుంది. నడక సమయంలో నొప్పి వస్తుంది. కాస్త దూరం నడిచినా కూడా కాళ్లు నొప్పి పుట్టడం జరుగుతుంది. ఇలాంటి లక్షణం కనిపిస్తే లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేయించుకోవాలి.


తిమ్మిర్లు పట్టడం
ఎక్కువసేపు కాలును కదపకుండా ఉంచితే అప్పుడప్పుడు తిమ్మిరి పడుతుంది. ఇది సాధారణమే. కానీ తరచూ తిమ్మిరి పడుతుంటే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. మడమ దగ్గర తిమ్మిరి అధికంగా ఉంటే అది అధిక కొలెస్ట్రాల్ వల్లనేమో అని అర్థం చేసుకోవాలి. ధమనులు దెబ్బ తినడం వల్లే ఇలా జరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట ఈ తిమ్మిర్లు అధికంగా పడతాయి. ఇది అధిక కొలెస్ట్రాలకు ఒక సంకేతంగా భావించాలి.


చల్లగా పాదాలు
ఎలాంటి కారణం లేకుండా పాదాలు చల్లగా మారితే అది అధిక కొలెస్ట్రాల్ కి సంకేతమే. వాతావరణం మరీ చల్లగా ఉన్నా కూడా సాధారణంగా పాదాలు అంత చల్లగా మారవు. అలా మారుతున్నాయి అంటే అది అధిక కొలెస్ట్రాల్ లక్షణం అని తెలుసుకోవాలి.


చర్మం రంగు
కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డు తగులుతూ ఉంటుంది. దీని వల్ల శరీరంలోని కొన్ని భాగాలకు రక్తప్రసరణ సవ్యంగా జరగదు. ఈ ప్రభావం అవయవాలపై తీవ్రంగా పడుతుంది. తక్కువ రక్త సరఫరా కారణంగా చర్మం రంగులో మార్పు వస్తుంది. కాబట్టి చేతులలో చర్మం రంగులో మార్పు వస్తే ఆ విషయాన్ని కచ్చితంగా పట్టించుకోవాలి.


గాయం మానడం
గాయాలు తగిలినప్పుడు అవి త్వరగా మానకుండా ఆలస్యం అవుతుంటే... ఆ ప్రాంతానికి రక్తప్రసరణ సవ్యంగా జరగడం లేదని అర్థం. సవ్యంగా జరగకపోవడానికి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వే కారణం. కాబట్టి గాయాలు ఎక్కువకాలం కాళ్లు, చేతులపై ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటే అధిక కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి.


ఈ లక్షణాలన్నీ గమనించడం కాస్త కష్టమే. ఎక్కువ మంది వీటిని పట్టించుకోరు. ఈ సంకేతాలు చాలా చిన్నగా మొదలవుతాయి. ఇవన్నీ అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలుగా భావించాలి. అధిక కొలెస్ట్రాల్ విషయాన్ని పట్టించుకోకపోతే అది భవిష్యత్తులో గుండె జబ్బులకు, గుండెపోటుకు కారణం అవుతుంది. 



Also read: పెద్ద మంట పెట్టి వంట చేస్తున్నారా? అలాంటి ఆహారం తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం









































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.