ప్రశ్న: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లయి ఏడాది దాటుతోంది. నా భర్త చాలా మంచివాడు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. అత్తామామలు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అయినా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఒక్క పూట కూడా మనస్ఫూర్తిగా తినలేక పోతున్నాను. నా ఛాతీపై ఎంతో భారం మోస్తున్న ట్టు ఉంది. మనస్పూర్తిగా నవ్వి సంవత్సరం పైనే దాటింది. దీనికి కారణం నా భర్త నుండి నేను ఒక రహస్యాన్ని దాచి ఉంచాను. అది ఎప్పుడు బయట పడుతుందో అన్న భయంతో నలిగిపోతున్నాను. మరొకపక్క ఆ విషయాన్ని నేనే నా భర్తకి చెప్పాలని కూడా అనుకుంటున్నాను. నా భర్తకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు నేను ఒకప్పుడు కాలేజీలో కలిసి చదువుకున్నాం. చదువుకున్నప్పుడే మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నాం, కానీ తర్వాత అతనికి నాకు సరిపడదనిపించి విడిపోయాను. అనుకోకుండా మా పెద్దవాళ్లు అతని అన్ననే నాకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో నా భర్త తమ్ముడు విదేశాల్లో ఉన్నాడు. అతడి గురించి మేము పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లికి కూడా అతను హాజరు కాలేని పరిస్థితి ఉంది. దాంతో ఆయన పెళ్లికి రాలేదు. నేను పెళ్లికి ముందు వారి ఫ్యామిలీ ఫోటోలు కూడా చూడలేదు. మాకు పెళ్లయ్యాక వీడియో కాల్ ద్వారా అతడిని నాకు పరిచయం చేశారు నా భర్త. అప్పుడు ఇద్దరం ఒకరిని చూసి మరొకరం షాక్ అయ్యాం. అప్పటినుంచి నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అతను ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు, నేను అతనితో ఇంతవరకు మళ్లీ మాట్లాడలేదు. అతడు నా మాజీ ప్రియుడని నా భర్తకు తెలిస్తే ఏమవుతుందోనని భయమేస్తుంది. ఈ విషయాన్ని దాచి ఉంచడం మంచిదా? లేక  చెప్పడం మంచిదా? దయచేసి సలహా ఇవ్వండి.


జవాబు: మీది ఒక విచిత్రమైన పరిస్థితి. సినిమాల్లోనే ఇలా జరుగుతుందని అనుకుంటాం, కానీ నిజ జీవితంలో కూడా జరిగే అవకాశం ఉందని అర్థం అవుతుంది. మీ పెళ్లికి మీ భర్త తమ్ముడు విదేశాల్లో ఉండడం, పెళ్లికి ముందు మీరు వారి ఫ్యామిలీ ఫోటోలు చూడకపోవడం వల్ల ఈ పెళ్లి జరిగి ఉంటుంది. మీకు ముందే తెలిస్తే ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకోరని అర్థం అవుతుంది. మీ భర్త మంచివాడని చెబుతున్నారు. అర్థం చేసుకునే గుణం ఉందని అంటున్నారు. కాబట్టి ఒకసారి చెప్పి చూడండి. అది కూడా అతని తమ్ముడు ఎదుటే కూర్చుని చెబితే మంచిది. భవిష్యత్తులో ఈ విషయం అతని తమ్ముడు ద్వారానో, ఇతరుల ద్వారానో తెలిస్తే మీపై ప్రతికూల అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరే ముందుగా చెప్పడం మంచిది.


ఈ విషయం మీ అత్తమామలకు తెలియాల్సిన అవసరం లేదనిపిస్తోంది. కానీ మీ భర్తకు నిజాయితీగల భార్యగా మీరు ఉండాలని అనుకుంటే కచ్చితంగా ఈ విషయాన్ని చెప్పండి. చెప్పడానికి ముందు అతని తమ్ముడితో కూడా ఒకసారి మాట్లాడండి. అతను కూడా చెప్పాలనుకుంటున్నాడా? దాయాలనుకుంటున్నాడో ..కనుక్కోండి. అతను కూడా చెప్పాలని అనుకుంటే మీ ఇద్దరూ కలిసి చెప్పడం మంచిది. అంతే కాదు మీ పరిచయం మాటల వరకే ఉందని చెప్పండి. తాము ఇద్దరం ఒకరినొకరు ఎప్పుడో మరిచిపోయామని, ఇప్పుడు స్నేహితుల్లాగా, వదినా మరదల్లాగే ఉంటామని ఆయనకు వివరించండి. ఒకే ఇంట్లో ఇలాంటి పరిస్థితిలో మీరు నడుచుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది.కాబట్టి ఈ విషయంలో మీరు ఆచితూచి అడుగేయాలి. మీ మరిది, మీరు కలిసి చెప్పకుండా వదిలేయాలని అనుకుంటే... అలా వదిలేయడమే మంచిది. ఈ విషయం తెలియడం వల్ల మీ భర్త చాలా బాధపడతారని మీ ఇద్దరికీ అనిపిస్తే చెప్పకుండా వదిలేయండి. ఏదైనా సరే మీ ఇద్దరూ కలిపి నిర్ణయించుకోవడం మంచిది. 


Also read: రోజుకో పచ్చి ఉల్లిపాయ తింటే నెలసరి సమస్యలు దూరం









































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.