ప్రశ్న: మాది పెద్దల కుదిర్చిన వివాహం. పెళ్లయి పదేళ్లు దాటింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాకు మొదటినుంచి ఆయనలో ఎలాంటి తేడా కనబడలేదు. అయితే ఒకసారి నేను కొత్త దుస్తులు కొని తెచ్చుకున్నాను. ఆ కొత్త దుస్తుల్లో నా లోదస్తులు కూడా ఉన్నాయి. నేను బయటకు వెళ్ళినప్పుడు నా భర్త నా దుస్తులు వేసుకొని అద్దం ముందు తనను తాను చూసుకొని మురిసిపోతున్నాడు. నా రాకని పసిగట్టలేక... ఓ రోజు నాకు దొరికిపోయారు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. షాక్ కొట్టినంత పని అయింది. ఎందుకిలా చేస్తున్నారు? అని అడిగితే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేమైనా మానసిక రోగమా? అతని చేత ఆ అలవాటు మానిపించడం ఎలా?


జవాబు: మీ భర్త మీ లోదుస్తులు వేసుకొని, మీ దుస్తులు ధరించి తనని తాను చూసి మురిసిపోతున్నారని చదివి మాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఇలా ఎప్పుడు నుంచి జరుగుతుందో మీకు కూడా తెలియదు. మీరు కనిపెట్టి కొన్ని నెలలే అవుతోంది. మొదటి నుంచి ఇలాగే ఉన్నారా లేక ఈ మధ్యనే ఇలా మారారా అన్న సంగతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ భర్తకు మీ దుస్తులు ధరించాలన్న కోరిక వెనుక అతని అభిప్రాయాలు, భావాలు, ప్రేరణలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి. అతను వ్యక్తిగత ప్రాధాన్యతలు మారాయా అనే విషయాన్ని కూడా తెలుసుకోండి. గొడవ పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదు, బంధాలు తెగిపోవడం తప్ప. కాబట్టి గొడవలా కాకుండా నెమ్మదిగా అడగండి. అతని మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ట్రాన్స్ జెండర్లతో స్నేహం కుదరినా కూడా కొంతమంది వారిలా తయారవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి కొత్త స్నేహాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి. 


అతనికి ఏదైనా మానసిక సమస్య వచ్చిందేమో కూర్చోబెట్టి ప్రేమగా అడగండి. పిల్లలకు తెలిస్తే ఎంత అవమానకరంగా ఉంటుందో చెప్పండి. అలాగే తనకు మానసికంగా ఏమైనా మద్దతు కావలేమో ప్రశ్నించండి. అలా బట్టలు వేసుకోవాలన్న కోరిక ఎప్పటి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇది అతి పెద్ద సమస్య కాదు, అలాగని వదిలేసేంత అంత చిన్నది కూడా కాదు. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని చెడగొట్టే సమస్య. కాబట్టి మీ బంధాన్ని కాపాడుకుంటూనే ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా వెతుక్కోవాలి. మీ భర్త నోరు విప్పి అన్ని విషయాలు చెబితేనే ఏ పరిష్కారమైనా దొరుకుతుంది. మీ భర్త మీకు ఏమీ చెప్పకపోతే మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లండి. వారు కౌన్సిలింగ్ ద్వారా అతని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే కౌన్సిలింగ్ కూడా అందిస్తారు.



Also read: ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో HOG పదం ఎక్కడ ఉందో కనిపెట్టండి, అది కూడా పది సెకన్లలో...



















































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.