దేశ‌వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. భక్తులు తమకు నచ్చిన రీతిలో వినాయకుడి విగ్రహాలను తయారుచేసి తమ ప్రత్యేకతను చాటారు. ఎకో ఫ్రెండ్లీ గణపతి, చాక్లెట్, కొబ్బరి కాయలు, డ్రై ఫ్రూట్స్ ఇలా పలు రకాలతో భక్తులు వినాయకుడి విగ్రహాలను చేసి పూజలు అందించారు. అంతేకాదు, తమ ప్రత్యేక వినాయక విగ్రహాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడంతో అవి వైరల్‌గా మారుతున్నాయి.

  


Also Read: Ganesh Chaturthi: బిస్కెట్ ప్యాకెట్లు, రుద్రాక్షలతో వినాయకుడి అలంకరణ... ఫుడ్ వేస్టేజ్ పై అవగాహన


తాజాగా ముంబయి పోలీసులు తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఓ వినాయకుడి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ వినాయకుడు ఏకంగా ఖాకీ డ్రస్ వేసుకుని, లాఠీ పట్టుకుని, షూ వేసుకుని మరీ దర్శనమిచ్చాడు. ఈ ఫొటోను షేర్ చేసిన ముంబయి పోలీసులు ‘కొత్త ఆఫీసర్‌కి ఇండియన్ ప్రిమియర్ సెక్యూరిటీ స్వాగతం చెబుతోంది. IPS అవతారంలో గణపతి బప్పా. విలే పర్లే పోలీసు స్టేషన్ పరిధిలోని రాజేంద్ర కేన్ ఇంట్లో ఛార్జ్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని సరదాగా వ్యాఖ్య జోడించారు.   






ఈ ఫొటోను చూసిన నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ‘ఈయ‌న క‌న్నా బెస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంకెవరు ఉంటారు, వినాయకుడే పోలీస్ ఆఫీస‌ర్ అయితే.. ఈ ప్ర‌పంచంలో ఇక క్రైమ్ జ‌ర‌గ‌దు. ప్ర‌జ‌లు కూడా స్వేచ్ఛ‌గా రోడ్ల మీద తిరుగుతారు’ అంటూ నెటిజ‌న్లు త‌మ‌కు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.