సాయంత్రం 6 దాటిన తర్వాత కాసేపు బయట కూర్చుందామని అనుకున్నారో ఇక అంతే సంగతులు. దోమలు మీ రక్తాన్ని హాయిగా లాగించేస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్ లో దోమల వల్ల డెంగ్యూ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఆవరణ లేదా చుట్టు పక్కల ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అపరిశుభ్రంగా ఉంటే దోమలు నిల్వ ఎక్కువగా ఉండి అవి మిమ్మల్నే కుట్టేస్తాయి. ఇంకేముంది శరీరం మీద అది ఎక్కడ కుట్టిందో అక్కడ ఒకటే దురద. ఒక పట్టాన వదలదు. చిన్న పిల్లలు అయితే దోమ కుట్టిన ప్రదేశంలో అదే పనిగా గోకుతూ రక్తం వచ్చి పెద్ద పుండు అయ్యేలా చేసుకుంటారు. గోకడం వల్ల దురద దగ్గడం ఏమో కానీ చర్మం ఎర్రగా మారిపోయి పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేస్తాయి. దాని నుంచి ఉపశమనం పొందటం కోసం ఆయింట్ మెంట్లు, క్రీములు రాసేస్తారు. కానీ ఒక్కోసారి అవి కూడా పని చెయ్యవు.


దురద తగ్గించే వంటింటి చిట్కా..


దోమ వల్ల కలిగే దురదని తగ్గించేందుకు ఒక సింపుల్ చిట్కా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అది కూడా మీ వంటింట్లో దొరికే సులభమైన పదార్థాలతోనే దోమల వల్ల ఏర్పడే దురద, చికాకు, మంట తగ్గించుకోవచ్చు. సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన దాని ప్రకారం మీకు కావాల్సిందల్లా కొద్దిగా బేకింగ్ సోడా, నీళ్ళు మాత్రమే. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని అందులో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దాన్ని దురదగా ఉన్న ప్రదేశంలో రాసుకుని 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి ముందుగా దోమ కుట్టిన ప్రదేశాన్ని సబ్బు, నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత వాపు, దురద తగ్గించడానికి దోమ కుట్టిన ప్రదేశంలో 10 నిమిషాల పాటు ఐస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. లేదంటే చల్లని నీటిలో ముంచిన శుభ్రమైన క్లాత్ తో క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బేకింగ్ సోడా పేస్ట్ రాసుకోవాలి.


10 నిమిషాల పాటు ఉంచుకుని క్లీన్ చేసుకున్న తర్వాత కూడా దురదగా అనిపిస్తే యాంటిహిస్టామైన్ ట్యాబ్లెట్ తీసుకోవడం లేదా క్రీమ్ రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. దోమలు కుట్టకుండా ఉండటం కోసం నిండుగా దుస్తులు ధరించడం మంచిది. DEET, Icaradin, నిమ్మకాయ యూకలిప్టస్ క్రీమ్స్ శరీరానికి అప్లై చేసుకోవడం మంచిది. దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా దోమతెర వెంట తీసుకెళ్ళి అందులో నిద్రించడం ఉత్తమం.


ఈ మొక్కలు ఉన్నా దోమలు పరార్


దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు కొన్ని మొక్కలు ఇంటి ఆవరణలో పెంచుకుంటే మంచిది. ఇవి తాజా ఆక్సిజన్ అందించడమే కాదు దోమలు రాకుండా అడ్డుకుంటాయి. పుదీనా, వెల్లుల్లి, లావెండర్, రోజ్మేరీ, మేరీ గోల్డ్ ప్లాంట్, తులసి మొక్క వంటివి పెంచుకున్న కూడా వాటి ఘాటు వాసనకు దోమలు పారిపోతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: డయాబెటిస్ అదుపులో ఉండటం లేదా? ఆయుర్వేదం చెప్పిన ఈ ఆహారాలతో సాధ్యమే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial