Rainy Season Travel Hacks : వర్షాకాలంలో చాలామంది ట్రిప్​కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తూ ఉంటారు. వర్షాలు వస్తున్నాయి కాబట్టే ట్రిప్​కి వెళ్లాలని ప్లాన్ చేసుకునే వాళ్లు కూడా ఉంటారు. ఎందుకంటే వర్షంలో తడుస్తూ.. లొకేషన్స్​ని ఎక్స్​ప్లోర్ చేయడాన్ని వారు చాలా ఇష్టపడతారు. పైగా వర్షాలు కురిసే సమయంలో ప్రకృతి అందాలు మరింత బ్రైట్​గా కనిపిస్తాయి. కాబట్టి లొకేషన్స్ చూసేందుకు, ఫోటోలు దిగేందుకు చాలా బాగుంటాయి. 

మీరు కూడా వర్షాకాలంలో ఈ అందాలను ఎక్స్​ప్లోర్ చేయడానికి ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బెస్ట్​ ఎక్స్​పీరియన్స్ చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. అలాగే కొన్ని హ్యాక్స్ ఫాలో అయితే మంచి ఫలితాలు చూడొచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? వేటిని ప్యాక్ చేసుకోవాలి? ట్రావెల్ టైమ్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

ప్యాకింగ్ సమయంలో.. 

వర్షాకాలంలో ట్రిప్​కి వెళ్లాలనుకుంటే మీరు కొన్ని టిప్స్ ప్యాకింగ్​ నుంచే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్యాకింగ్ కోసం వాటర్​ప్రూఫ్ బ్యాగ్స్, కవర్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి ఎలక్ట్రానిక్స్, దుస్తులను కాపాడడంలో హెల్ప్ అవుతాయి. దుస్తులను సర్దుకునేప్పుడు హెవీగా, బరువుగా ఉండే దుస్తులను సర్దుకోవడం మానేయండి. ఎందుకంటే మీరు తడిచినా అవి ఆరేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి. తేలికగా తొందరగా ఆరిపోయే దుస్తులను, సింథటిక్ డ్రెస్​లను ప్యాక్ చేసుకుంటే మంచిది. 

ఫ్లిప్​ ఫ్లాప్స్, వాటర్​ప్రూఫ్ షూలు ఎక్స్​ట్రా తీసుకువెళ్తే మంచిది. గొడుగు, రైన్​ కోట్​ని కూడా లగేజ్​లో ఉండేలా చూసుకోండి. అదీ కూడా మీరు తీయడానికి వీలుగా ఉండేలా చూసుకోండి. ప్లాస్టిక్ జిప్ లాక్ బ్యాగ్స్ కూడా కొన్ని ప్యాక్ చేసుకోండి. ఇవి ఫోన్, పవర్​బ్యాంక్, మందులు, ఐడీ కార్డులు వంటి పెట్టుకునేందుకు హెల్ప్ అవుతాయి. 

ట్రావెల్ టిప్స్.. 

లగేజ్ ప్యాక్ చేసుకున్నా.. ట్రావెల్​ చేసేప్పుడు మీరు వెళ్తొన్న ప్రదేశంలో వాతావరణ సూచనలు తెలుసుకోండి. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు, వరదలు వంటి అలెర్ట్స్ చెక్ చేసుకోవాలి. హిమాచల్, ఉత్తరాఖండ్ వంటి ప్రదేశాలకు వర్షాకాలంలో వెళ్లకపోవడమే మంచిది. రోడ్ ట్రిప్స్ కంటే.. ట్రైన్ జర్నీ లేదా విమాన ప్రయాణం చేయడం బెస్ట్. ఒకవేళ వెదర్ బాగోకుంటే వీటికి అలెర్ట్ ఇస్తారు. రోడ్ జర్నీలో ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. వర్షం కారణంగా నెట్​వర్క్ సరిగ్గా ఉండకపోవచ్చు కాబట్టి ఆఫ్​లైన్ మ్యాప్స్​ని ఉపయోగిస్తే మంచిది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు వెళ్లాలనుకునే ప్రదేశాల్లో ముందుగానే హోటల్స్ బుక్ చేసుకుంటే మంచిది. దీనివల్ల రద్దీ పెరిగినా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నీటితో నిండిపోయే లొకేషన్స్​కి వెళ్లకపోవడమే మంచిది. జలుబు, దగ్గు, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎటాక్ చేస్తే ఇబ్బంది లేకుండా మందులు క్యారీ చేయడం మంచిది. అలాగే దోమలు కుట్టకుండా క్రీమ్​లు తీసుకెళ్తే మంచిది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ తీసుకోవాలి. అలాగే మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఎక్కడ స్టే చేస్తున్నారు వంటి డిటైల్స్ ఎవరికైనా ఇస్తే మంచిది. 

చేయాల్సిన పనులివే.. 

వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్​ఫాల్స్ దగ్గరికి వెళ్లకపోవడమే మంచిది. వరద ఉద్ధృతి పెరిగితే పరిస్థితి డేంజర్​గా మారిపోతుంది. ప్రకృతిలో తిరిగేలా వెళ్లాలి కానీ ట్రెక్కింగ్ చేసే ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. కొండల్లో ట్రెక్ చేసుకుంటే కాలు జారిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. కేరళ, మున్నార్, కూర్గ్, మేఘాలయ వంటి ప్రదేశాలు వర్షాకాలంలో వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు.