Missed Period with Negative Pregnancy Test : పీరియడ్స్ (Menstrual cycle) మిస్ అవ్వడం అనేది చాలామందికి కామన్. అయితే వివిధ కారణాలు, పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు పీరియడ్స్ రాకపోతే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ అదే సమయంలో ప్రెగ్నెన్సీ టెస్ట్​ నెగిటివ్ వస్తే? అసలు ఇలా జరుగుతుందా? ఈ సమస్యకు కారణాలు ఏంటి? దానిని ప్రెగ్నెన్సీ అనుకోవచ్చా? లేదా ఇతర సమస్యలకు సంకేతంగా తీసుకోవాలా?

గర్భధారణ పరీక్షలో నెగెటివ్ వచ్చి పీరియడ్స్ రాకపోతే కచ్చితంగా అది ఆరోగ్య సమస్యలకు సంకేతంగా చెప్పవచ్చు. ఒత్తిడి, బరువులో మార్పులు, హార్మోనల్ సమస్యలు, PCOS వంటి ఎన్నో సమస్యలు ఋతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంతకీ పీరియడ్స్​ఆలస్యం కావడానికి రీజన్స్ ఏంటో.. వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూసేద్దాం. 

హార్మోనల్ సమస్యలు (Hormonal Imbalances)

హార్మోన్ల అసమతుల్యత పీరియడ్స్​ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది పీరియడ్ స్కిప్​ అయ్యేలా చేస్తుంది. ఒత్తిడి, మెడికల్ కండీషన్స్, లైఫ్​స్టైల్​లో మార్పుల కారణంగా హార్మోన్స్​లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది పీరియడ్స్​ని ఆలస్యం చేస్తుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), థైరాయిడ్ వంటి సమస్యలున్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల 2 లేదా 3 నెలలు కూడా పీరియడ్స్ డిలే అవ్వొచ్చు. 

ఒత్తిడి (Stress)

పీరియడ్స్​ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలలో ఒత్తిడి ఒకటి. అవును మీరు ఏ కారణం చేతనైనా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే పీరియడ్స్ రావడం చాలా కష్టంగా మారుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఎగ్ రిలీజ్ (అండం విడుదల) చేయనివ్వకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే శరీరంలో ఒత్తిడివల్ల కార్టిసోల్ ఎక్కవగా విడుదల అవుతుంది. ఇది హార్మోన్లను నెగిటివ్​గా ఇంపాక్ట్ చేసి పీరియడ్ సైకిల్​ని డిస్టర్బ్ చేస్తుంది. 

ప్రెగ్నెన్సీ (Early Pregnancy)

ప్రెగ్నెన్సీ టెస్ట్​లో నెగిటివ్ వచ్చినంత మాత్రానా మీరు గర్భం దాల్చలేదని అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో మీరు ముందుగా టెస్ట్ చేసుకున్నారని అర్థం. కొన్నిసార్లు ఈ టెస్ట్ మీకు నెగిటివ్ రిజల్ట్స్ చూపించవచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చినా మీ శరీరం hCG హార్మోన్​ స్థాయిలను ఉత్పత్తి చేయకపోతే.. ఈ టెస్ట్ నెగిటివ్ చూపిస్తుంది. కాబట్టి కొన్నిరోజులు తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ రావొచ్చు. 

బరువులో మార్పులు (Weight Fluctuations) 

బరువు అతిగా పెరగడం లేదా ఎక్కువగా తగ్గడం వల్ల కూడా పీరియడ్స్ స్కిప్ అవ్వొచ్చు. పీరియడ్స్​కి సంబంధించిన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి శరీరంలోని కొవ్వు హెల్ప్ చేస్తుంది. బరువులో సడెన్​గా మార్పులు రావడం వల్ల ఈ ప్రక్రియ డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల కూడా పీరియడ్స్ లేట్ అవుతాయి. 

మోనోపాజ్​కి ముందు (Perimenopause)

మోనోపాజ్​ దశ వస్తే పీరియడ్స్ రావు. అలాగే ఈ మోనోపాజ్​కి ముందు కూడా పీరియడ్స్​లో బ్రేక్స్ ఉంటాయి. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల మీరు ఈ సమస్యను ఎదుర్కొంటారు. 35, 40 దాటిన తర్వాత ఇలాంటి సమస్యను చూస్తారు. ఇది కామన్​ కూడా. 

థైరాయిడ్ (Thyroid)

థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో కూడా హార్మోనల్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ రెగ్యులర్​గా రాకుండా అడ్డుకుంటాయి. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను విడుదల చేసి మెటబాలీజం తగ్గిస్తుంది. ఇది పీరియడ్స్​పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. 

మందులు (Medications)

వివిధ ఆరోగ్య సమస్యలకోసం మందులు తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి కూడా పీరియడ్​ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. అయితే ఋతుక్రమం ముందుగా వచ్చేలా లేదా లేట్​గా వచ్చేలా చేస్తాయి. ఇవే కాకుండా బర్త్ కంట్రోల్ పిల్స్, పీరియడ్స్ లేట్​గా వచ్చేందుకు తీసుకునే మెడిసన్స్ కూడా పీరియడ్ సైకిల్​ని డిస్టర్బ్ చేస్తాయి. 

పీరియడ్స్ లేట్ అవ్వడానికి ఇవన్నీ కారణాలు కావొచ్చు. అయితే సమస్య ఎక్కువకాలం ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యసహాయం తీసుకోవాలి. గైనకాలజిస్ట్​తో మీ సమస్యను పంచుకుంటే వారు వివిధ టెస్ట్​ల ద్వారా మీ సమస్యను గుర్తిస్తారు. దానికి తగిన మెడిసన్స్ ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ లైఫ్ స్టైల్​లో మార్పులు చేస్తే పీరియడ్ సైకిల్ రెగ్యులర్​ అయిపోతుంది.