Negative impacts of mobile devices on children : మా పిల్లాడు ఫోన్​ లేకపోతే భోజనం చేయడు అండి. మా పిల్లలైతే ఫోన్​లో గేమ్స్ సూపర్​గా ఆడేస్తారు. మాకంటే ఫోన్​ గురించి ఎక్కువ మా పిల్లలకే తెలుసు. ఇలాంటివి చెప్తూ పిల్లలకి ఫోన్​ ఇచ్చి వదిలేస్తున్నారా? అయితే జాగ్రత్త. మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే చేజేతులారా నాశనం చేస్తున్నట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. 


పిల్లలు మారాం చేస్తున్నారనో.. లేదా స్కూల్​ వర్క్ ఉందనో.. లేదా తమని డిస్టర్బ్ చేయకుండా కిడ్స్ సైలెంట్​గా ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తారనో.. చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా తర్వాత ఫోన్ అనేది పిల్లలకి అడెక్షన్​గా మారిపోతుంది. ఈ సమయంలో వారిలో శారీరకంగా, మానసికంగా కొన్ని సమస్యలు మొదలవుతాయి. అవేంటంటే.. 


శారీరక సమస్యలు 


పిల్లల్లో వచ్చే ఒబెసిటీ, అధికబరువుకు ఉన్న ప్రధాన కారణాల్లో మొబైల్ ఒకటి. ఇతర కారణాలవల్ల బరువు పెరిగినా.. ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలకు సెల్​ఫోన్​ కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే దానివల్ల ఫిజికల్​ యాక్టివిటీ ఉండదు. శారీరకంగా బలంగా ఉండరు. మెటబాలీజం తగ్గిపోతుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే చిన్నవయసులోనే కంటిచూపు మందగిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తీవ్రమవుతాయి. నిద్ర సమస్యలు పెరుగుతాయి. నిద్ర నాణ్యత తగ్గి మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 


మానసిక సమస్యలు 


పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడితో వారిలో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి. ముభావంగా మారిపోతారు. బ్రెయిన్ యాక్టివ్​గా ఉండదు. అలాగే మొబైల్ చూడడమనేది వ్యసనంగా మారుతుంది. ఇది మానసికంగా కృంగదీస్తుంది. ఇతరులతో కలిసేందుకు, మాట్లాడేందుకు మొగ్గు చూపరు. మొబైల్​లోనే ఎక్కువకాలం గడుపుతారు. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ వారి లైఫ్​ని డిస్ట్రాక్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. 


చదువుపై ప్రభావం.. 


పిల్లలు అధికంగా మొబైల్ ఉపయోగించడం వల్ల చదువుపై కూడా నెగిటివ్ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వారు ఇంక ఏ పనిపై ఫోకస్ చేయలేరు. అలాగే చదువుపై కూడా దృష్టి పెట్టలేరు. ఫోకస్ తగ్గిపోతుంది. చదువుకోసం ఫోన్ ఉపయోగించడం వేరు. కానీ చదువునే మరపించేలా ఫోన్​ని ఉపయోగించకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పిల్లల్లో చదువుకోవాలన్న కోరిక తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోతుంది. మతిమరుపు ఎక్కువ అవుతుంది. దీనివల్ల చదివినా ఎగ్జామ్​లో రాయలేకపోవచ్చు. క్రియేటివిటీ కూడా తగ్గిపోతుంది. స్కిల్స్​ని కూడా వదిలేస్తారు. 


పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు


పిల్లలు మొబైల్ ఎక్కువగా ఉపయోగించకుండా ఉండేలా చూసుకోవడం పేరెంట్స్ బాధ్యతే. వారు ఎంతగా ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తే పిల్లలు అంతగా ఫోన్​కి అడిక్ట్ అయిపోయి మీ మాటలకు నెగిటివ్​గా మారుతారు. మొబైల్ ఉపయోగించడానికి అనుమతి ఇస్తూనే.. దానికి టైమ్​ లిమిట్ పెట్టాలి. రోజులో ఎంత సమయం ఫోన్​ని వాడుకోవచ్చో బౌండరీలు సెట్​ చేయాలి.


ఫోన్​ వాడకాన్ని దూరం చేసేలా పనులు చెప్పడం, స్పోర్ట్స్ ఆడించడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేయించాలి. పిల్లలతో మాట్లాడుతూ వారిని ఎంగేజ్ చేస్తూ, వారికి నచ్చిన టాపిక్స్​ మాట్లాడుతూ ఉండాలి. పిల్లలు ఫోన్​లో కొన్ని యాప్స్, సైట్స్ ఓపెన్ చేయకుండా సెట్టింగ్స్ మార్చాలి. అలాగే పిల్లలు వినియోగిస్తున్న ఫోన్​పై పేరెంట్స్ కచ్చితంగా దృష్టి పెట్టాలి. మొబైల్ అవసరం లేకుండా స్టడీ చేసేలా పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వాలి.