SIP Formula For Best Returns In Mutual Funds: ధనవంతుల ఇంట్లో పుట్టిన ఏ వ్యక్తీ ఖర్చు చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు, రిటైర్మెంట్ తర్వాతి జీవితం గురించి చింతించాల్సిన పని లేదు. కానీ, జీతం ఆదాయంపై మాత్రమే ఆధారపడే వ్యక్తి దీనికి భిన్నం. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి పెన్షన్ సౌకర్యం లేనప్పుడు, చాలా ముందు నుంచే తన వృద్ధాప్యం గురించి ఆలోచించాలి. తాను యవ్వనంలో ఉన్నప్పుడే & పని చేస్తున్నప్పుడే ఒక మంచి పెట్టుపడి పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి. రిటైర్మెంట్ సమయానికి ఒక మంచి మొత్తాన్ని కూడబెట్టాలి. తద్వారా, వృద్ధాప్యం గౌరవంగా గడిచిపోతుంది.
వృద్ధాప్యంలో అక్కరకు వచ్చే మంచి పథకం లేదా పెట్టుబడి కోసం శోధిస్తున్న వ్యక్తుల కోసం లాభదాయకమైన మ్యూచువల్ ఫండ్ ఫార్ములాను నిపుణులు సూచిస్తున్నారు. దీని సాయంతో దీర్ఘకాలంలో చాలా డబ్బు సంపాదించవచ్చు.
మ్యూచువల్ ఫండ్ SIP ఉత్తమం
మార్కెట్‌లో పెట్టుబడి కోసం అనేక ఆప్షన్లు కళ్ల ముందు కనిపిస్తాయి. మ్యూచువల్ ఫండ్ 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' (SIP) దీర్ఘకాలిక పెట్టుబడికి అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికల్లో ఒకటి. పేరుకు తగ్గట్లుగా, SIP అనేది మ్యూచువల్ ఫండ్లలో చేసే ఒక క్రమబద్ధమైన & క్రమశిక్షణ కలిగిన పెట్టుబడి పద్ధతి. దీనిలో పెట్టుబడిదారుడు నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. ఇది పెట్టుబడిదారుడి సౌలభ్యాన్ని నెలవారీగా, త్రైమాసికానికి ఒకసారి లేదా వార్షికంగా డబ్బులు జమ చేయవచ్చు.
SIP ప్రయోజనాలు
ఈ వ్యూహం అందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక SIP పెట్టుబడిదారుడు తన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా SIPని కొంతకాలం నిలిపివేయవచ్చు, పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు లేదా క్రమంగా పెంచుకోవచ్చు. SIP దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చరిత్ర చెబుతోంది. 15x15x15 SIP ఫార్ములా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిలకు సరైన వ్యూహంగా మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
15x15x15 SIP ఫార్ములా అంటే ఏమిటి?
ఈ ఫార్ములాను తూ.చా. తప్పకుండా ఆచరించిన పెట్టుబడిదారులు కేవలం 15 సంవత్సరాలలో దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడబెట్టవచ్చు. 15x15x15 SIP ఫార్ములాలో మొదటి "15" మీరు ప్రతి నెలా SIPలో రూ. 15,000 పెట్టుబడి పెట్టాలని చూపిస్తుంది. రెండో "15" మీకు 15 శాతం వార్షిక రాబడి (అంచనా) ఉండాలని చెబుతుంది. మూడో "15" మీరు కనీసం 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలని సూచిస్తుంది.
ఈ సూత్రం ప్రకారం 15 సంవత్సరాలలో ఎంత కార్పస్ సృష్టించవచ్చో చూద్దాం:
నెలవారీ పెట్టుబడి: రూ. 15,000
మొత్తం పెట్టుబడి: నెలకు రూ. 15,000 చొప్పున 15 సంవత్సరాలలో రూ. 27,00,000 (15000 x 12 x 15)
అంచనా వేసిన మూలధన లాభం: రూ. 74,52,946
మొత్తం (పెట్టుబడి + అంచనా మూలధన లాభం): రూ. 1,01,52,946
SIPలో రిస్క్
SIP దీర్ఘకాలంలో మంచి రాబడి అందించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ఇది మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ (Market-linked investment) అని గుర్తుంచుకోండి. రాబడికి ఎటువంటి హామీ ఉండదు అన్నది దీని అర్ధం. పై సూత్రంలో చెప్పిన పేర్కొన్న 15 శాతం వార్షిక రాబడి ఒక అంచనా మాత్రమే & వాస్తవ రాబడి మార్కెట్ పరిస్థితులను బట్టి మారవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.