చిన్న చేప ఏటికి ఎదురీదుతుంది.చిట్టి చీమ తన బరువు కన్నా కొన్ని రెట్ల ఎక్కువ బరువును మోస్తుంది.
చిన్న జీవులకే అంత ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, తెలివైన మనుషులం. మనకెంత ఉండాలి? ఇలా అడుగుతుంది మేం కాదు. మిస్ వరల్డ్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన శ్రీ షైనీ. ఈమె అమెరికా తరపున పోటీలో నిలిచింది. పోలాండ్ అందగత్తె మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటే, శ్రీ షైనీ మొదటి రన్నరప్ గా నిలిచింది. అందాల పోటీల్లో పాల్గొంది అనగానే ఆమె జీవితమంతా పూల దారులే అనుకుంటారు చాలా మంది. కానీ శ్రీ షైనీ జీవితం అలా కాదు, గుండెల్లో జబ్బుని మోసుకుంటూ తిరుగుతోంది. టీనేజీలోనే ముఖం మొత్తం కాలిపోయింది. అయినా ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు అడుగువేసి మిస్ వరల్డ్ పోటీలకు చేరింది. 


ప్రవాస భారతీయురాలు...
శ్రీ షైనీ పేరు చదివితేనే తెలిసిపోతోంది ఆమెకు భారతీయ మూలాలు ఉన్నాయని. ఆమె పుట్టింది పంజాబ్ లోని లూథియానాలో. శ్రీ షైనీకి అయిదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వచ్చేసింది. ఇక్కడే వారి కుటుంబం సెటిలైపోయింది. చిన్నప్పట్నించి అందాల పోటీల్లో పాల్గొనాలని, అందగత్తెగా పేరు తెచ్చుకోవాలని కోరిక. పన్నేండేళ్ల వయసులో చాలా అరుదైన గుండె వ్యాధి ఉన్నట్టు బయటపడింది. గుండెల్లో పేస్ మేకర్ వేయాల్సి వచ్చింది. ఇప్పటికీ గుండె సమస్య ఆమెను వేధిస్తూనే ఉంటుంది. యూనివర్సిటీ చదివే రోజుల్లో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఆమె ముఖం మొత్తం కాలిన గాయాలే. చర్మం అంతా కాలిపోయింది. ఆ వీడియోను కూడా ఆమె తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. తన ముఖాన్ని చూసి తానే ఏడ్చిన రోజులు ఎన్నో. మందులు వాడుతూ, సరైన ఆహారం తింటూ తిరిగి చర్మాన్ని మెరిసేలా చేసుకుంది. దీనికి కొన్నేళ్ల సమయం పట్టింది. అయినా ఆమె ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఆత్మవిశ్వాసాన్ని వదల్లేదు. 



మిస్ అమెరికా...
అందాల రాణిగా నిలవాలన్న తన కోరికను తీర్చుకునేందుకు అమెరికాలోనే ప్రయత్నించింది. ఆమెకు అమెరికా పౌరసత్వం ఉండడంతో ఆ దేశం తరుపునే పోటీ చేసే అవకాశం వచ్చింది. అంతకన్నా పలు అందాల పోటీల్లో పాల్గొన్ని ‘మిస్ అమెరికా వరల్డ్’ గా ఎంపికైంది. చివరికి మిస్ వరల్డ్ పోటీల్లో తన సత్తా చాటి మొదటి రన్నరప్ గా నిలిచింది. ఆమె యువతకు చెప్పే సూక్తి ఒక్కటే ‘ఏ బలహీనమైన క్షణంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని వీడకండి, అదే మిమ్మల్ని నడిపిస్తుంది’ అని.