Male Mental Wellness : మానసిక ఆరోగ్యం అనేది ఎవరికైనా ముఖ్యమే. అది ఆడవారికైనా.. మగవారికైనా. కానీ సమాజం మగవారి విషయంలో కాస్త కఠినంగానే ప్రవర్తిస్తుందనే చెప్పుకోవాలి. చట్టాలు, సమాజం, కుటుంబం ఇలా అందరిలోనూ మగవారి ఎమోషన్స్‌కి పెద్దగా వాల్యూ దొరకట్లేదు. ఈ ధోరణి వల్ల చాలామంది పురుషులు ఇబ్బంది పడుతున్నారని.. మానసికంగా కృంగిపోతూ సూసైడ్స్ వరకు వెళ్తున్నారని పలు అధ్యయనాలు గుర్తించాయి. దీనిలో భాగంగానే జూన్ నెలను మెన్స్ మెంటల్ హెల్త్ అవరెనెస్ మంథ్‌గా నిర్వహిస్తున్నారు.
మగవారి సమస్యలను గుర్తిస్తూ.. మానసికంగా వారు పడుతోన్న వేధనను సమాజానికి చెప్పేందుకు వీలుగా Men's Mental Health Awareness Monthను చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్యం ముఖ్యమని చెప్తూ.. వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. డిప్రెషన్, ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. సమాజంలో మగవారు ప్రధానంగా ఎదుర్కొంటున్న అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సహాయం అడగలేక..
వివిధ అధ్యయనాలు ప్రకారం చాలామంది పురుషులు తమ మానసిక ఆరోగ్యంపై బయటకి మాట్లాడలేకపోతున్నారట. వృత్తిపరమైన సహాయం తీసుకోవడంలో కూడా వెనకడుగు వేస్తున్నారట. స్ట్రాంగ్, టఫ్ అనే ట్యాగ్స్ సమాజం ఇవ్వడం వల్ల వారు సాయం అడిగేందుకు కూడా వెనకాడుతున్నారట.
ఆత్మహత్యలు..
ఇలా అన్ని తమలోనే దాచుకుని.. మానసికంగా కుంగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషుల్లోనే ఆత్మహత్య రేట్లు గణనీయంగా పెరిగాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మగవారు సూసైడ్ చేసుకునే అవకాశం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉందట.
కుటుంబ బాధ్యతలు..
పెళ్లికి ముందు, తర్వాత పేరెంట్స్ బాధ్యత, అలాగే మ్యారేజ్ తర్వాత భార్య, పిల్లల బాధ్యత తీసుకుంటూ.. వారి అంచనాల రీచ్ అయ్యేందుకు తెగ కష్టపడుతున్నారట. తల్లిదండ్రులు, భార్య, పిల్లల ఇష్టాలు తీర్చడం కోసం.. వారికి కనీసం వసతులు అందించడం కోసం చాలామంది తమ పర్సనల్ లైఫ్‌ని వదిలేసుకుంటున్నారట.
శారీరక ఆరోగ్యం..
మానసిక కుంగిపోవడం వల్ల చాలామంది శారీరకంగా కూడా ప్రభావితమవుతున్నారట. అందుకే వారిలో అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నిద్ర సమస్యలు ఎక్కువ అవుతున్నాయట. అందుకే మగవారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మాదకద్రవ్యాలు కూడా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు.
వర్క్ ప్లేస్‌లో
వర్క్ ప్లేస్‌లో పనితీరు, ఆర్థిక బాధ్యతలు, సామాజిక అంచనాలపై మగవారు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారట. దీనివల్ల వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతింటుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఈ అంశాలను బహిరంగంగా చర్చించేందుకే ఈ జూన్ నెలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. #MensHealthMonth, #MentalHealthMatters, #ManUpToTalk వంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో అవగాహన పెంచుతున్నారు.