చంద్రుడి చుట్టూ తిరిగి రానున్న టిటో దంపతులు
సొంత ఖర్చులతో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి స్పేస్ టూరిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న డెన్నిస్ టిటో.. మరో అంతరిక్ష విహారయాత్రకు సిద్ధం అయ్యాడు. తన భార్య అకికోతో కలిసి చంద్రుడిని చుట్టి వచ్చేందుకు రెడీ అయ్యాడు. స్పేస్ఎక్స్ చేపడుతున్న మూన్ జర్నీలో టిటో రెండు సీట్లు బుక్ చేసుకున్నాడు. ఈ యాత్రకు సంబంధించి స్పేస్ ఎక్స్ సంస్థతో గతేడాది ఆగష్టులో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్ల లోపు అంతరిక్షయానం చేసే అవకాశం ఉంటుంది. ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ లో టిటో చంద్రుని చుట్టూ తిరగబోతున్నాడు.
మూన్ జర్నీ కోసం సీట్లు బుక్ చేసుకున్న తొలిజంట
గత 20 ఏళ్ల నుంచి మూన్ మీదకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నానని, అందుకే స్పేస్ఎక్స్ జర్నీ కోసం టికెట్ బుక్ చేసుకున్నానని టిటో తెలిపారు. చంద్రుడి మీదకు వెళ్లే జర్నీ కోసం సీటు బుక్ చేసుకున్న తొలి జంట టిటో దంపతులదే కావడం విశేషం. వీరితో పాటు మరో పది మంది ప్రయాణికులు స్పేస్ ఎక్స్ లో మూన్ జర్నీ చేయనున్నారు. ఈ ప్రయాణం దాదాపు వారం రోజులు ఉంటుంది. మూన్ మీదకు వెళ్లే రాకెట్ కు ప్రస్తుతం స్పేస్ ఎక్స్ సంస్థ పరీక్షలు జరుపుతుంది. అటు ఈ మూన్ జర్నీ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాన్ని స్పేస్ ఎక్స్ ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రయాణానికి ఎంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుందనే విషయాలను కూడా బయటకు చెప్పలేదు.
2001లో తొలి అంతరిక్షయాత్ర
డెన్నిస్ టిటో 2001లో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించాడు. అప్పట్లో రష్యన్ స్పేస్ షిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాడు. ప్రయాణంతో పాటు ఇతర ఖర్చులను కూడా తనే భరించాడు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వ్యతిరేకించినా టిటోను రష్యా అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లింది. ఆ టైంలో రష్యన్ స్పేస్ ఏజెన్సీకి డబ్బు అవసరం కావడంతో టిటో ఆ డబ్బును ఇచ్చాడు. సుమారు 20 మిలియన్ డాలర్లు అందించాడు. దీంతో ఆయనను రష్యా స్పేస్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ స్పేస్ ష్టేషన్ కు తీసుకెళ్లింది. ఇక టిటో వయసు ప్రస్తుతం 82 ఏండ్లుగా కాగా అంతరిక్ష యాత్ర చేసే సమయానికి ఆయన వయసు 87కు చేరే అవకాశం ఉంది.
అటు SpaceX, రిచర్డ్ బ్రాన్సన్ స్థాపించిన వర్జిన్ గెలాక్టిక్ (SPCE.N)తో సహా కొన్ని కంపెనీలు అంతరిక్ష ప్రయాణాన్ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, జెఫ్ బెజోకు సంబంధించిన బ్లూ ఆరిజిన్ ప్రస్తుతం సుమారు 3,50,000 అడుగుల (106 కి.మీ) ఎత్తులో ఉన్న సబ్ ఆర్బిటల్ పరిధిలో జాయ్ రైడ్‌లను అందిస్తుంది.