Infosys Q2 Results: విప్రో, టీసీఎస్ ఫలితాలతో డీలా పడిన ఐటీ సెక్టార్ ఇన్వెస్టర్ల నెత్తిన ఇన్ఫోసిస్ పాలు పోసింది. స్ట్రీట్ అంచనాలను బీట్ చేస్తూ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక (Q2FY23) ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో, అందరూ ఊహించిన దాని కంటే పెద్ద మొత్తంలో వృద్ధిని నివేదించింది.
రూ.9,300 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను, రూ.16.50 మధ్యంతర డివిడెండ్‌ను కూడా ఈ కంపెనీ ప్రకటించింది.
దేశంలో రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల మధ్య కూడా పూర్తి ఆర్థిక సంవత్సర అంచనాలను పెంచింది. FY23లో 14%-16% ఆదాయ వృద్ధిని సాధించగలమని జులైలో ఈ కంపెనీ అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాను 15%-16%కు పెంచింది.
డీల్ విన్స్‌లో మంచి ఒరవడి కొనసాగుతోందని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ (MD & CEO) సలీల్ పరేఖ్ వెల్లడించారు. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం కాంట్రాక్టు విలువ (TCV) 2.7 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడు త్రైమాసికాలతో పోలిస్తే ఇదే అత్యధిక విలువ.
11% పెరిగిన నికర లాభం
సెప్టెంబరు త్రైమాసికంలో, ఇన్ఫోసిస్ ఏకీకృత ఆదాయం రూ.36,538 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.29,602 కోట్ల ఆదాయంతో పోలిస్తే, ఇప్పటి ఆదాయం 23.4 శాతం పెరిగింది. ఏకీకృత నికర లాభం రూపంలో రూ.6,021 కోట్లను ఈ కంపెనీ మిగుల్చుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం లాభం రూ.5,421 కోట్లతో పోలిస్తే ఇది 11% వృద్ధి.
ఆపరేటింగ్ మార్జిన్ 1.4% QoQ పెరిగి 21.5 శాతానికి చేరింది. YoY ప్రాతిదికన 2.1 శాతం తగ్గింది. ఈ మొత్తం ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ మార్జిన్ అంచనాలను 21-22 శాతానికి కంపెనీ సవరించింది.
స్థిర కరెన్సీ (CC) ప్రాతిపదికన.. జులై- సెప్టెంబరు నెలల ఆదాయం 18.8% YoY, 4% QoQ పెరిగింది. మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం వాటా 61.8 శాతం. గా ఉంది. స్థిర కరెన్సీ పద్ధతిలో డిజిటల్ విభాగాదాయం ఏడాది క్రితంతో పోలిస్తే 31.2 శాతం పెరిగింది. ఐరోపా ఆదాయం 30%, అమెరికా ఆదాయం 15% పెరిగాయి.
తగ్గిన అట్రిషన్ రేటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలన్నది ఇన్ఫోసిస్ ప్రణాళిక. తొలి 6 నెలల్లో 40,000 మందిని నియమించుకుంది. సెప్టెంబరు త్రైమాసికంలో నికర ఉద్యోగుల సంఖ్య 10,032. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,45,218కు చేరింది. వలసల రేటు (అట్రిషన్ రేటు) 27.1 శాతానికి తగ్గింది.
షేర్ల బైబ్యాక్
ఒక్కో షేరుకు గరిష్టంగా రూ.1850 ధరతో, రూ.9,300 కోట్ల విలువైన షేర్ బైబ్యాక్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ గరిష్ట ధర వద్ద 5.02 కోట్ల షేర్లను కొనుగోలు చేయవచ్చు. BSEలో గురువారం షేరు ముగింపు ధర రూ.1,419.70తో పోలిస్తే, బైబ్యాక్ ధర 30 శాతం ఎక్కువ. గత రెండు బైబ్యాక్‌ల తరహాలోనే ఈసారి కూడా ఓపెన్ మార్కెట్ మార్గాన్నే ఇన్ఫోసిస్ ఎంచుకుంది. అంటే, ఓపెన్ మార్కెట్‌లో ఫ్లోటింగ్ ఉన్న షేర్లను రూ.1850కు మించకుండా, ఎంత తక్కువ రేటుకు దొరికినా కొనుగోలు చేస్తుంది.
మధ్యంతర డివిడెండ్
ఒక్కో షేరుకు మధ్యంతర డివిడెండుగా రూ.16.50 చెల్లించేందుకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికోసం రూ.6,940 కోట్లను కంపెనీ కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన మధ్యంతర డివిడెండు కంటే ఇది 10 శాతం ఎక్కువ.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.