Brengi River Missing | అప్పటి వరకు జోరుగా పరవళ్లు తొక్కుతున్న నది.. ఒక్కసారిగా మాయమైంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 కిమీల మేర ఒక్క చుక్క నీరు కూడా కనిపించలేదు. ఆ నది పైన డ్యామ్, ఆనకట్టలు కూడా లేవు. మరి, అప్పటివరకు అక్కడ కనిపించిన ప్రవాహమంతా ఏమైంది? నీరంతా ఎక్కడికి వెళ్లిపోయిందా అని స్థానికులు, అధికారులు వెతకడం ప్రారంభించారు. అప్పుడు వారికి ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. దాన్ని చూసి అంతా నోరెళ్లబెట్టారు. ‘‘ఏందయా ఇది.. నేనెప్పుడూ సూడలే’’ అంటూ ముక్కున వేలు వేసుకున్నారు. ఇంతకీ అక్కడ ఏమైంది? నది అకస్మాత్తుగా మాయవడానికి కారణం ఏమిటీ? 


దక్షిణ కశ్మీర్‌లో ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న ప్రశ్న.. నది అకస్మాత్తుగా ఎందుకు మాయమైంది? ఆ నీరు ఎక్కడికి వెళ్తుందనే. అయితే, నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన జనాలకు ఎన్నడూ లేని వింత కనిపించింది. నది మధ్యలో పెద్ద గొయ్యి (Sinkhole - సింక్‌హోల్) కనిపించింది. నది ఎగువ నుంచి వస్తున్న నీరు మొత్తం ఆ భారీ గోతిలోకి వెళ్లిపోతున్నాయి. అయితే, నదిలో నీరంతా ఒక గోతిలోకి వెళ్తున్నాయంటే.. అది క్షణాల్లో నిండిపోవాలి. కానీ, అక్కడ అది జరగలేదు. నదిలో నీటిని మొత్తం ఆ గొయ్యే మింగేస్తోంది. ఆ నీరు ఎక్కడికి వెళ్తున్నాయనే జాడ కూడా తెలియడం లేదు. దీంతో నది అడుగున ఏదో పెద్ద సొరంగం ఉండి ఉంటుందని, నీరు మొత్తం అందులోకి వెళ్తుందనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, ఆ నీరు ఏదో ఒక మార్గం నుంచి బయటకు రావాలి. కానీ, అది జరగడం లేదు. అందుకే ఈ ఘటన మిస్టరీగా మారింది. పైగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


అనంత్‌నాగ్‌లోని కోకెర్‌నాగ్‌లోని వందేవల్గామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రసిద్ధి చెందిన బ్రెంగీ నది అకస్మాత్తుగా మాయం కావడానికి కారణం పర్యావరణ మార్పులేనని నిపుణులు తెలుపుతున్నారు. నదిలో నీరు ఒక్కసారే మాయం కావడం వల్ల దిగువ పరివాహక ప్రాంతంలోని చేపలు సైతం చనిపోయి కనిపించినట్లు స్థానికులు తెలుపుతున్నారు. 


Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!


అయితే, నది మధ్యలో ఏర్పడిన ఈ గొయ్యి వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం వల్ల స్థానిక నివాసాలు కూడా కూలిపోతాయేమో అనే భయవంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ నదిలో నీరు ఎక్కడికి వెళ్తుందో తెలియకపోవడంతో అంతా గందరగోళంతో ఉన్నారు. అయితే, ఇది సహజసిద్ధంగా ఏర్పడిన సొరంగమని, సున్నపు రాయి క్రమంగా కరిగిపోవడం వల్ల నదీ గర్భం కుంగిపోయి, సింక్ హోల్ ఏర్పడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని నిపుణుల కమిటీ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. 


Also Read: మిలింద్ సోమన్‌ను చూశావా బేబమ్మా? ‘జపనీస్ ఫారెస్ట్ బాత్‌’తో ముసలోడే కావట్లేదట, ఇంతకీ ఏమిటదీ?


సింక్ హోల్ సమీపంలో 144 సెక్షన్: ఈ భారీ గొయ్యి వద్దకు ఎవరూ వెళ్లరాదని పోలీసులు ఆదేశించారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. మాయమైన ఆ నది.. ఆ సొరంగం నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియరాలేదని, ఎవరైనా ఆ గోతిలో పడితే ప్రాణాలతో బయటపడటం కష్టమని భావిస్తున్నారు. మీడియాకు కూడా అక్కడికి అనుమతి ఇవ్వడం లేదు. ఈ హోల్‌ను ఈ నెల 11నే గుర్తించినట్లు తెలుస్తోంది.