అందరి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం నిరంతరం శ్రమించే వాళ్ళు డాక్టర్స్. పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడతారు. అర్థరాత్రి అపరాత్రి అని లేకుండ ఎమర్జెన్సీ అనగానే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పేషెంట్ ని కోసం వచ్చేస్తారు. ప్రాణాలు కాపాడటం కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. అందుకే డాక్టర్ ని దేవుడితో పోలుస్తారు. వైద్యుల కష్టాన్ని గుర్తించి జులై 1 జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.


ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడే డాక్టర్స్ కి అసలు రోగాలే రావా? అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఎందుకు రావు వాళ్ళు మనుషులే కాకపోతే డాక్టర్స్ అందరికీ ఒక ఆరోగ్య రహస్యం ఉంటుంది. పలువురు ప్రముఖ డాక్టర్లు తమ ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పుకొచ్చారు.


ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తాగడం


“నేను నా రోజుని గోరువెచ్చని నీటితో స్టార్ట్ చేస్తాను. రాత్రి పడుకోవడానికి 2-3 గంటల ముందు భోజనం కంప్లీట్ చేస్తాను. నీళ్ళు తాగిన తర్వాత ఒక పండు లేదా నట్స్ తీసుకుంటాను. ఇలా చేయడం వల్ల నా గట్ ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయాన్నే శక్తివంతంగా ఉండగలుగుతున్నా. నా పొట్ట చుట్టు కొవ్వుని కూడా కరిగించేస్తుంది. అన్నింటి కంటే మించి రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది” అని చెప్పుకొచ్చారు లైఫ్ స్టైల్ డాక్టర్ అక్షత్ చద్దా.


టెన్నిస్


“నేను టెన్నిస్ ప్లేయర్ ని. ప్రతిరోజూ క్రమం తప్పకుండా టెన్నిస్ ఆడతాను. నేను ఫిట్ గా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. నాకు ఇష్టమైన ఈ ఆట ఆదమ్ వల్ల విశ్రాంతి పొండటంలో సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది” అని పూణే డాక్టర్ సచిన్ షా వెల్లడించారు.


బాస్కెట్ బాల్


“ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఒక గంట బాస్కెట్ బాల్ ఆడేందుకు టైమ్ కేటాయిస్తాను. ఇది నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని మెరుగుపరిచే చక్కని అలవాటు. ఆరోగ్యకరమైన జీవనశైలి విధానం పాటిస్తాను. ఇతర రోగులకి కూడ ప్రేరణగా నిలుస్తున్నాను” అని తన ఆరోగ్య రహస్యం చెప్పుకొచ్చారు కొచ్చి హాస్పిటల్ డాక్టర్ హిషామ్ అహ్మద్.


యోగా


“నేను ప్రతిరోజూ తప్పకుండా పాటించే ఒక ఆరోగ్యకరమైన అలవాటు యోగా సాధన. వైద్యులం కనుక చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని నుంచి బయట పడేందుకు రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు యోగా మంచి విశ్రాంతిని ఇస్తుంది” అని గురుగ్రామ్ వైద్యురాలు డాక్టర్ అంజలి పేర్కొన్నారు.


15 నిమిషాల వ్యాయామం


“నేను జాగింగ్/  యోగా/ స్ట్రెచ్చింగ్ వంటివి ప్రతిరోజూ 15 నిమిషాలు తప్పకుండా చేస్తాను. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి శ్రేయస్సుకి చాలా ముఖ్యమైనది” అని లండన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సారిక కక్వానీ పంచుకున్నారు.


మెట్లు ఉపయోగించడం


“నేను సమయానికి భోజనం చేస్తాను. ఎప్పుడు లిఫ్ట్ స్థానంలో మెట్లు ఎక్కడానికి ఉపయోగిస్తాను. ధ్యానం ద్వారా మైండ్ ఫుల్ గా ఉండేందుకు ట్రై చేస్తాను. ఒత్తిడిని దూరం చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది” అంటున్నారు మరొక డాక్టర్ శుచి శర్మ.


ఈ అలవాట్లు అన్నీ డాక్టర్లు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా పాటిస్తారు. అందుకే వైద్యులు అంత ఫిట్ గా ఉంటారు. మీరు కూడా ప్రతిరోజూ ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని అలవాటుగా మార్చుకుని మిస్ కాకుండా ఫాలో అయితే ఆరోగ్యంగా ఉంటారు.  


 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: బరువు తగ్గేందుకు, నీళ్లు మాత్రమే తాగుతూ ఉపవాసం ఉండొచ్చా? వాటర్ ఫాస్టింగ్‌కు అంత చరిత్ర ఉందా?