ఒకటో, రెండో కాదు ఏకంగా 580 ఏళ్ల తరువాత ఏర్పడబోతున్న సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం. నవంబర్ 19, శుక్రవారం ఈ గ్రహణం ప్రపంచానికి కనువిందు చేయబోతోంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాకపోయినప్పటికీ సంపూర్ణమనే అనుకోవాలి , ఎందుకంటే భూమి, చంద్రుడిని దాదాపు 97 శాతం కప్పేస్తుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణ కాలం ఉదయం 12.48 నుంచి మొదలవుతుంది.  మధ్యాహ్నం 2.34 నిమిషాలకు ఉచ్ఛస్థాయికి చేరుకుంటుంది. అయితే గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అవన్నీ నిజమేనా? సైన్సు ఏం చెబుతోందో తెలుసుకుందాం....


నమ్మకం: గ్రహణాన్ని కళ్లతో నేరుగా చూడకూడదు
నిజం: సైన్స్ ప్రకారం, చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడచ్చు. ఎలాంటి సమస్యా ఉండదు. 


నమ్మకం: గ్రహణం పట్టిన సమయంలో ఏమీ తినకూడదు, తాగకూడదు
నిజం: ఇది ప్రజల్లో బాగా నాటుకుపోయిన అపోహ. గ్రహణం సమయంలో శక్తివంతమైన కిరణాలు వెలువడి ఆహారాన్ని, నీటిని విషపూరితం చేస్తాయని కొంతమంది నమ్మకం. అందుకే ఆ సమయంలో ఏమీ తినరు, తాగరు. అది నిజం కాదు. గ్రహణం సమయంలో తినొచ్చు, తాగొచ్చు. 


నమ్మకం: సెక్స్ చేయకూడదు
నిజం: గ్రహణం పట్టిన సమయంలో సెక్స్ కు దూరంగా ఉండాలని, లేకుండే చెడు జరుగుతుందని ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది. కానీ ఇది నిజమే అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. 


నమ్మకం: పదునైన వస్తువులను ముట్టుకోకూడదు
నిజం: గ్రహణ సమయంలో పదునైన వస్తువుల వల్ల తగిలిన గాయం, ఎక్కువ కాలం మానదని అంటారు. రక్తస్రావం కూడా త్వరగా ఆగదని, దాని వల్ల ఏర్పడే మచ్చ కూడా జీవితకాలం ఉండిపోతుందని నమ్ముతారు. ఇది నిజంగా చాలా వింత అపోహ. ఏమాత్రం నిజం లేదంటోంది సైన్స్. 


నమ్మకం: గిన్నెలతో శబ్దాలు చేయాలి
నిజం: పూర్వం రాక్షసుడు లేదా ఓ జంతువు చంద్రుడిని మింగినప్పుడు గ్రహణం సంభవిస్తుందని ప్రజలు నమ్మేవారు. కాబట్టి వారిని భయపెట్టి తరిమికొట్టడానికి గిన్నెలతో పెద్ద శబ్ధాలు చేసేవారు. అలా అది నమ్మకంగా స్థిరపడిపోయింది. దాని వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. 


నమ్మకం: గ్రహణ సమయంలో నిద్రపోవద్దు
నిజం: దీనికి కూడా సైన్స్ ప్రకారం ఎలాంటి వివరణ లేదు. మీకు నచ్చితే నిద్రపోవచ్చు, లేదంటే మెలకువగా ఉండొచ్చు. జరిగే నష్టం ఏం లేదు. 
 
మనదేశంలో కేవలం ఇక్కడే...
తెలుగు రాష్ట్రాలకు ఈ చంద్రగ్రహణం ఒక శాతం కూడా కనిపించే అవకాశం లేదు. కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం కూడా లేదు. అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల ప్రజలు నేటి చంద్ర గ్రహణంలో చివరి దశలను చూడగలరు. 


Read Also: అన్నం తినలేకపోతున్నారా? దానికి బదులు వీటిని తినండి


Read Also:  అవిసెగింజలు తింటే ఆరోగ్యం... కానీ ఏం చేసుకుని తినాలో తెలియడం లేదా? ఇవిగో కొన్ని రెసిపీలు...


Read Also: శీతాకాలంలో గుండెపోటు అధికంగా వస్తుంది ఎందుకు? రిస్క్ ఇలా తగ్గించుకోండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి