Global Back Pain Cases Are Rising : ప్రపంచవ్యాప్తంగా నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2023లో 'ది లాన్సెట్ రుమటాలజీ'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 619 మిలియన్ల మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. 1990తో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 60 శాతం పెరిగింది. ఈ అధ్యయనం అంచనా ప్రకారం.. 2050 నాటికి నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య 843 మిలియన్లకు చేరుకోవచ్చు. ఈ సంఖ్య ఐరోపా మొత్తం జనాభా కంటే ఎక్కువగా ఉంటుంది.
వెన్నునొప్పికి ప్రధాన కారణం
ది స్పైన్ జర్నల్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణాలలో నడుము నొప్పి ఒకటి. మైగ్రేన్ తర్వాత ఇదే తర్వాతి స్థానంలో ఉంది. ది స్పైన్ జర్నల్ ఎడిటర్-ఇన్-చీఫ్ అయిన క్రిస్టోఫర్ బోనో ప్రకారం.. మనిషి ఎక్కువకాలం కూర్చోవడం వల్ల నడుము కింది భాగంపై చాలా ఒత్తిడిని పెరుగుతుంది. వెన్నెముక కింది భాగంలోని L4, L5 ఎముకలపై పడే ఈ ఒత్తిడి, కాలక్రమేణా ఈ ప్రాంతం క్షీణతకు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.
Also Read : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో పెరుగుతోన్న కేసులు
ఇటీవలి కాలంలో.. లాటిన్ అమెరికా నుంచి ఆసియా, ఆఫ్రికా వరకు ఉన్న ప్రాంతాలలో నడుము నొప్పి కేసులు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతాలలోని సామాజిక సహాయ వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు ఇప్పటికే వనరుల కొరతతో సతమతమవుతున్నాయని.. అధిక భారాన్ని మోస్తున్నాయని.. నాణ్యమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేని వారిపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉందని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
వయసు పెరగడం వల్ల వస్తోందా?
నడుము నొప్పి తరచుగా వృద్ధాప్యంతో ముడిపడి ఉండేది. కానీ దానితో బాధపడేది కేవలం వృద్ధులు మాత్రమే కాదు. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల అమెరికన్లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు డెస్క్ వద్ద కూర్చోవడం కూడా నడుము నొప్పికి ప్రధాన కారణం కావచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం.. దాదాపు 80 శాతం మంది పెద్దలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము కింది భాగంలో నొప్పిని అనుభవిస్తారు.
Also Read : నడుము నొప్పి తగ్గించే సులభమైన మార్గాలివే.. కూర్చునే విధానం నుంచి వ్యాయామాల వరకు
నడుమునొప్పికి మెదుడుకు లింక్?
కొత్త పరిశోధన ప్రకారం.. నడుము నొప్పిని అర్థం చేసుకోవడానికి జీవశాస్త్రం, జన్యుశాస్త్రం బలమైన ఆధారాలు కావచ్చు. నొప్పిపై జరిగిన పరిశోధనలో నొప్పి అనుభూతి మెదడులో ఏర్పడుతుందని కూడా వెల్లడైంది. పెయిన్ ఎక్స్పర్ట్, అనస్థీషియాలజిస్ట్ అయిన జేన్ బ్యాలంటైన్ ప్రకారం.. వాపు లేదా స్నాయువు చిరగడం వంటి స్పష్టమైన సమస్య లేని ప్రాంతాలకు కూడా మెదడు కొన్నిసార్లు నొప్పి సంకేతాలను పంపగలదు.
నడుము నొప్పి ఎముకల సమస్య మాత్రమే కాదు..
ఒకప్పుడు నడుము నొప్పిని కేవలం ఒక యాంత్రిక సమస్యగా మాత్రమే పరిగణించేవారు. సమస్య వెన్నెముకలోని ఎముకలు లేదా డిస్కులలో ఉందని వైద్యులు నమ్మేవారు. దీంతో చికిత్స ఆ ప్రాంతంపైనే చేసేవారు. ఈ ఆలోచనా విధానం 1996 నుంచి 2004 మధ్య యునైటెడ్ స్టేట్స్లో డిసెక్టమీల సంఖ్య 14 శాతం పెరగడానికి దారితీసింది. అదే సమయంలో 1990 నుంచి 2001 మధ్య లంబార్ ఫ్యూజన్ శస్త్రచికిత్సల రేటు 220 శాతం పెరిగింది. ఆ తర్వాత నడుము నొప్పిని చూసే విధానం మారింది.
Also Read : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, అమెరికన్ పెయిన్ సొసైటీ 2007లో నడుము నొప్పి చికిత్స కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి. ఈ మార్గదర్శకాలు నడుమును కేవలం ఎముకలకే పరిమితం చేయలేదు. కండరాలు, స్నాయువులు, లిగమెంట్లు, ఫాసియా, నరాలను కూడా చేర్చాయి.
100 బిలియన్ డాలర్లు ఖర్చు
అమెరికాలో నడుము నొప్పి చికిత్స చాలా ఖరీదైనదిగా మారుతోంది. నడుము నొప్పికి సంబంధించిన వివిధ చికిత్సల కోసం ఏటా దాదాపు 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. క్యాన్సర్తో సహా మరే ఇతర వ్యాధి ఖరీదు కంటే ఇది తక్కువ కాదు. ఈ ఖర్చులో నడుమునొప్పి వల్ల ఉద్యోగం కోల్పోవడం, వైకల్య చెల్లింపులు, ఇతర ఎంపికల ఖర్చులు చేర్చనేలేదు. నడుము నొప్పిపై ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువని స్టాన్ఫోర్డ్ పరిశోధకులు నివేదిస్తున్నారు.
నడుము అనేది సంక్లిష్టమైన నిర్మాణం. దాని కండరాలు, స్నాయువులు, నరాల మధ్య ఉండే పరస్పర అనుసంధానం వల్ల చికిత్స చేసినా కోలుకోవడం ఆలస్యం జరుగుతుందట. నడుము నొప్పిని శాశ్వతంగా తొలగించే చికిత్సను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని.. కానీ అలాంటి అద్భుతమైన నివారణ ఇప్పట్లో రాదని క్రిస్టోఫర్ బోనో అంటున్నారు.
Also Read : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
