కరోనా మహమ్మారి మూడేళ్ళ పాటు అందరినీ వణికించేసింది. ఎంతో మందికి తమ ఆత్మీయులని దూరం చేసింది. కొంతమందికి అసలు కోవిడ్ వచ్చిందో లేదో కూడా తెలియనట్టు అలా వచ్చి ఇలా పోయింది. మరికొంతమందికి మాత్రం నెలల తరబడి హాస్పిటల్ లో ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీర్ఘకాలం పాటు కోవిడ్ బారిన పడి వాళ్ళు 10 నిమిషాల పాటు నిలబడిన తర్వాత వారి కాళ్ళు నీలం రంగులోకి మారడం గుర్తించినట్టు తాజా నివేదిక వెల్లడిస్తుంది. లాన్సెట్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం గురించి రాసుకొచ్చారు.
33 ఏళ్ల వ్యక్తి కాళ్ళ సిరల్లో రక్తం చేరడాన్ని సూచించే ఆక్రోసైనోసిస్ అనే పరిస్థితిని అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ అధ్యయనం వివరించింది. దీర్ఘకాలం పాటు కోవిడ్ బారిన వ్యక్తి కాసేపు నిలబడితే అతని కాళ్ళు ఎర్రబడటం ప్రారంభమయ్యింది. కాలక్రమేణా అది నీలం రంగులోకి మారాయని యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధ్యయనం తెలిపింది. 10 నిమిషాల పాటు నిలబడిన తర్వాత మారిన రంగు మరింత స్పష్టంగా కనిపించింది. అంతే కాదు రోగి కాళ్ళలో భయంకరమైన దురద అనుభూతి చెందాడు. నాన్ స్టాండింగ్ పొజిషన్ తిరిగి ప్రారంభించిన రెండు నిమిషాల తర్వాత రోగి కాళ్ళు మళ్ళీ సాధారణ రంగులోకి తిరిగి మారిపోయాయి.
కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకకముందు సదరు రోగిలో ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఆక్రోసైనోసిస్ రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమని నిపుణులు భావిస్తున్నారు. అటువంటి సమయంలో రోగికి పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాచీకార్డియా సిండ్రోమ్ (POTS) ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిలబడి ఉన్నప్పుడు హృదయ స్పందన రేటు అసాధారణంగా పెరుగుతుంది. లాంగ్ కోవిడ్ వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటు, శ్వాసక్రియ, జీర్ణక్రియ, లైంగిక శక్తి వంటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థతో సహా శరీరంలోని పలు వ్యవస్థలని ప్రభావితం చేస్తుందని తేలింది. దీన్ని ఎదుర్కొంటున్న రోగులకు ఇది దీర్ఘకాలిక కోవిడ్ వల్ల వచ్చిన లక్షణమని తెలియకపోవచ్చు. అదే విధంగా ఆక్రోసైనోసిస్, లాంగ్ కోవిడ్ మధ్య ఉన్న లింకు గురించి కూడా కొంతమంది వైద్యులకు తెలియకపోవచ్చని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ ఒకరు చెప్పుకొచ్చారు.
ఈ బృందం మునుపటి పరిశోధనలో లాంగ్ కోవిడ్ ఉన్న వారిలో డైసోటోనోమియా, POTS రెండూ అభివృద్ధి చెందుతాయని తేలింది. ఈ రెండూ పరిస్థితులు కండరాలని ప్రభావితం చేస్తాయి. నొప్పిని కలిగిస్తాయి. ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న వ్యక్తులలో దీని గురించి తప్పనిసరిగా అవగాహన కల్పించాలని పరిశోధకులు నొక్కి చెప్తున్నారు. అప్పుడే రోగులకి తగిన విధంగా వైద్యపరమైన సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. లాంగ్ కోవిడ్ కారణంగా అలసట, డిప్రెషన్, ఆందోళన, బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది రోగుల రోజువారీ కార్యకలాపాల మీద ప్రభావితం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి క్యాన్సర్ రోగుల కంటే దారుణంగా ఉంటుందని కనుగొన్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీ వంటల్లో జీడిపప్పు ఇలా వేసుకున్నారంటే రుచి అమోఘం