Nostrils: ఊపిరిపీల్చుకునేటప్పుడు మీ రెండు ముక్కు రంధ్రాలు పనిచేస్తాయి, కానీ వాటిల్లో ఒకదాని ద్వారానే అధికంగా శ్వాస తీసుకుంటారు. కావాలంటే మీరు ఓసారి గమనించుకోండి. కొందరు ఎడమవైపున్న నాసికా రంధ్రం నుంచి గాలి పీలుస్తుంటే, మరికొందరు కుడి ముక్కు రంధ్రం నుంచి పీలుస్తారు. మీరు ఏ వైపు నుంచి అధికంగా పీలుస్తున్నారో వేలితో ఒక వైపు రంధ్రాన్ని మూసి చెక్ చేసుకోండి. జంట అవయవాల మధ్య అసమతుల్యత మంచిది కానప్పటికీ ముక్కు రంధ్రాల విషయంలో ఇది అధికంగా జరుగుతుంది. ఎడమ లేదా కుడి నాసికా రంధ్రంతో గాలి పీలిస్తే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో యోగా ఆరోగ్యనిపుణులు వివరించారు.  


ఎడమ నాసిక రంధ్రం గాలి పీలిస్తే..
ఎడమ ముక్కు రంధ్రం ద్వారా అధికంగా గాలి పీల్చుకునే వ్యక్తులు స్త్రీ స్వభావం, సృజనాత్మకతను కలిగి ఉంటారు. సహజంగా ప్రవర్తిస్తారు. విశ్రాంతి అధికంగా తీసుకునేందుకు ఇష్టపడతారు. అంతర్ముఖంగా ఉంటారు. అధికంగా మాట్లాడరు.  సున్నితంగా ఉంటారు. కళాత్మకమైన ఆలోచనలు అధికంగా ఉంటాయి. వీరిలో స్వీయ నియంత్రణ చాలా తక్కువగా ఉంటుంది. తమ మీద తమకు కాస్త తక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎడమ ముక్కు రంధ్రాన్ని ఇడా నాడి అని కూడా పిలుస్తారు. 


కుడి నాసికా రంధ్రం ద్వారా...
దీన్ని పింగళనాడి అని పిలుస్తారు. కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చే వారిలో పురుష స్వభావం అధికంగా ఉంటుంది. వీరు చాలా చురుకుగా ఉంటారు. మేధావులు కూడా. ఉద్వేగభరితమైన ఆలోచనలను కలిగి ఉంటారు. తార్కికంగానూ ఆలోచించగలరు. వీరు మనసులో ఏదీ దాచుకోరు, అందరిలో త్వరగా కలిసిపోతారు.  హైపరయాక్టివ్ గా ఉంటారు. దీనివల్ల ఒత్తిడికి గురవుతారు. దూకుడుగా వ్యవహరిస్తారు. సూటిగా మాట్లాడతారు. అధిక శక్తికి సూచన. 


ఒకేలా పనిచేయాలి...
నిజానికి ఎడమ, కుడి రెండూ నాసికా రంధ్రాలు ఒకేలా పనిచేయాలి. ఒక దాని ద్వారా అధిక గాలి పీల్చడం మంచిది కాదు. కానీ ఇప్పుడు చాలా మందిలో ఇది కనిపిస్తుంది. ఇలా నాసిక రంధ్రాలలో ఒకటి అధికంగా పనిచేయడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది.శ్వాసక్రియకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. 


ఈ ఆసనంతో మేలు...
ప్రతిరోజూ అనులోమ్ విలోమ్ ప్రాణాయమాన్ని రోజూ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే కాసేపు ఎడమ వైపు ముక్కు రంధ్రం మూసి ఊపిరిపీల్చడం తరువాత కుడి వైపు ముక్కు రంధ్రం మూసి ఊపిరిపీల్చడం... ఇదే అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. ఇలా చేయడం శ్వాస చక్కగా ఆడడమే కాదు, ఏకాగ్రత, ఓపిక,స్వీయ నియంత్రణ పెరుగుతుంది. ఒత్తిడి, యాంగ్జయిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. 



Also read: రైల్వే మటన్ కర్రీ, స్వాతంత్య్రానికి పూర్వం రైళ్లలో ఇదే ఫేమస్


Also read: ఊరగాయలు ఈనాటివి కావు, గత వందల ఏళ్లుగా తింటూనే ఉన్నాం, అప్పట్లో ఇవి ఔషధాలు