రైల్వే మటన్ కర్రీ వండడం వచ్చిన వాళ్లు ఇప్పుడు ఉన్నారో లేరో తెలియదు కానీ, స్వాతంత్య్రానికి పూర్వం మన దేశంలో బ్రిటిషర్ల హవా నడుస్తున్న కాలంలో మాత్రం చేయి తిరిగిన వంటగాళ్లు ఉండేవారు. ఆ వంటగాళ్లంతా మన దేశస్థులే. కానీ వారు ఈ కర్రీని కేవలం బ్రిటిష్ అధికారుల కోసం మాత్రమే వండాల్సి వచ్చింది. అది కూడా ఆ తెల్ల దొరలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు వారికి ఈ కూరను వడ్డించేవారు. అందుకే ఈ కూరకు ‘రైల్వే మటన్ కర్రీ’ అని పేరు వచ్చింది. దీన్ని సృష్టించింది కూడా రైళ్లలో వంట చేసే నిష్ణాతులు. వారిని ‘కాన్సామాలు’ అని పిలిచేవారు. తొలిసారి ఈ కూరను పశ్చిమ రైల్వేలోని ‘ఫ్రాంటియర్ రైలు’లోని ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రవేశపెట్టారు. దీని రుచి అందరికీ నచ్చడంతో దేశవ్యాప్తంగా రైల్వే క్యాంటీన్లు, ఫస్ట్ క్లాస్ కోచ్‌లు, రైల్వే ఆఫీసర్ల క్లబ్‌లలో వండి వడ్డించడం మొదలుపెట్టారు.


ఇలా బయటపడింది...
రైల్వే మటన్ కర్రీ మొదట్లో ఎవరికీ తెలియదు. ఒక బ్రిటిష్ అధికారికి వల్లే బయటికి తెలిసిందని చెప్పకుంటారు. ఫ్రాంటియర్ రైలులోని వంటగాళ్లు తమ కోసం మటన్ కర్రీ వండుకుంటున్నారు. ఒక బ్రిటిష్ అధికారు అనుకోకుండా వంటగదిలో వచ్చాడు. స్టవ్ మీద ఉడుకుతున్న కర్రీ వాసన చూసి మైమరిచిపోయాడు. దాన్ని అధికారుల కోసం ఏర్పాటు చేసిన రైల్వే మెనూలో చేర్చాలని, అయితే తమ రుచికి తగ్గట్టు కారాన్ని తగ్గించాలని సూచించాడు. అలా మటన్ కర్రీ కాస్త ‘రైల్వే మటన్ కర్రీ’ పేరుతో మెనూలో చోటు సంపాదించింది. 


ఏంటి స్పెషల్?
ఈ కూరలను తక్కువ మసాలలో, ఎక్కువ కారం వేసి వండుతారు. అలాగే ఆవనూనె, నెయ్యిని వాడతారు. టమోటాలు, బంగాళాదుంపలను కూడా వేస్తారు. ఇది వండే వారి చేయిని బట్టి రుచి మారిపోతుంది. ఇప్పుడు ఎక్కడైనా దీన్ని వండి వడ్డిస్తున్నారేమో సమాచారం లేదు. 





Also read: ఊరగాయలు ఈనాటివి కావు, గత వందల ఏళ్లుగా తింటూనే ఉన్నాం, అప్పట్లో ఇవి ఔషధాలు


Also read: రూట్ కెనాల్ సర్జరీ ప్రమాదకరమా? ఆ నటి ముఖం ఎందుకలా మారిపోయింది?