Rare Fruit Lasoda: పిజ్జాలు,  బర్గర్లు వచ్చాక ఆహారానికి మేలు చేసే సహజసిద్ధమైన పండ్లను తినేందుకు యువత ఇష్టపడడం లేదు. కేవలం వయసు మీరిన పెద్దలు, పిల్లలు మాత్రమే పండ్లను తినేందుకు ఇష్టపడుతున్నారు. మనదేశంలో ఎన్నో అరుదైన ఆహారాలు ఉన్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ప్రసిద్ధి చెందిన ఆహారాలు ఏవో ఒకటి లభిస్తాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న పండు కూడా చాలా అరుదైనది, ప్రత్యేకమైనది. ఈ చిన్న పండ్లు రాజస్థాన్లో అధికంగా లభిస్తాయి. ఇవి కేవలం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే కనిపిస్తాయి. మే, జూన్ నెలలో ఈ పండు లభిస్తుంది. ఈ పండు పేరు లాసోడా. దీన్ని గూండా అని కూడా పిలుస్తారు. 


ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్లు, ఖనిజాలు  పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో ఈ పండును భాగం చేసుకుంటే సంపూర్ణ పోషకాహారం తిన్నట్టే లెక్క. ఈ పండు తినడం వల్ల జీర్ణ క్రియ సక్రమంగా సాగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని ఔషధ గుణాలను ఆయుర్వేద వైద్యంలో కూడా గుర్తించారు. వివిధ వ్యాధుల చికిత్సకు ఆయుర్వేద మందుల్లో ఈ పండును ఉపయోగిస్తారు. 


ఇలా సోడా పండును పచ్చిగానూ తినొచ్చు, వండుకొని కూడా తినొచ్చు. పచ్చిగా తింటే చిరుతిండిలా ఉంటుంది. చిటికెడు ఉప్పు, కారం చల్లుకొని ఈ పండును అద్దుకొని తింటే అదిరిపోతుంది. అలాగే ఇతర పదార్థాలతో కలిపి ఊరగాయగా కూడా ఈ పండును చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ ఊరగాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రాజస్థాన్లోని చిన్నచిన్న గ్రామాల్లో లాసోడా పండ్ల చెట్లను పండిస్తారు. కిలో పండ్లు 180 రూపాయలు నుంచి 200 రూపాయలు దాకా అమ్ముడవుతాయి. అక్కడి ప్రజలు వీటిని అధికంగా తింటారు.


రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలోనే ఈ చెట్లు అధికంగా కనిపిస్తాయి. ఈ లాసోడా చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమే. ఈ చెట్టు కాండాన్ని కలపగా ఉపయోగిస్తారు. ఆకులను ఒంటెలు, మేకలకు ఆహారంగా వినియోగిస్తారు. ఎక్కువగా పశువులు ఈ చెట్టు ఆకులను తిని బతుకుతాయి.  వేసవిలోనే ఈ పండు లభిస్తుంది. కాబట్టి వీటిని తినడం వల్ల పొట్టకు చల్లదనం అందుతుంది. కాలేయం సమస్యలను దూరం చేస్తుంది. రక్తపోటు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు. ఈ పండును తినడం చాలా ముఖ్యం. చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారు  ఈ పండును తింటే ఆ సమస్యలు దూరం అవుతాయి. 


ఈ చెట్టు ఆకులను ఎండబెట్టి పొడిగా మార్చి దాచుకోవాలి. వాటిని గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం వల్ల కీళ్లనొప్పలు, వాపు వంటివి తగ్గుతాయి. పంటినొప్పిని తగ్గించడంలో కూడా ఇది ముందుటుంది. లసోడా పండ్లను అధికంగా మాత్రం తినకూడదు. చాలా మితంగా తినాలి. రోజుకు రెండు నుంచి మూడు పండ్లు తింటే చాలు. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. డయాబెటిస్ వ్యాధితో పోరాడుతున్నవారు దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 



Also read: హైబీపీ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు ఇవే





















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.