కృష్ణం రాజు సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే.. మనసుకు నచ్చిన విధంగా భోజనం చేయడంలో ఆయన ముందుంటారనే ప్రచారం ఉంది. అంతే కాదు, ఇండస్ట్రీలో ఆయన్ని కొందరు ‘అన్నదాత’ అని కూడా పిలుస్తారు. కేవలం ఆయన మాత్రమే కాకుండా.. షూటింగ్ సమయంలో ఇతరుల కోసం కూడా పెద్ద క్యారెజీలతో భోజనాలు తీసుకొచ్చేవారట.
కృష్ణం రాజు ప్రత్యేకంగా ఇదే ఇష్టమని ఎప్పుడూ చెప్పేవారు కాదట. ఏ వంటకాన్నైనా ఆనందంతో ఆరగించేవారట. అయితే, నాన్ వెజ్ అంటే మరింత మక్కువ అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. పెళ్లయిన కొత్తలో మనసుకు నచ్చనవి ఆర్డర్ చేయించుకుని మరీ తినేవారట. అంతేకాదు, ఒక్కోసారి ఆయనే స్వయంగా వంటలు చేసి, ఇతరులకు కూడా రుచి చూపించేవారట. కానీ, కాలక్రమేనా.. భోజనం తక్కువగా తినడం మొదలు పెట్టారట. ఇటీవల ఒకరు “ఏంటి సార్.. మరీ ఇంత తక్కువగా తింటున్నారు?’’ అని అడిగితే.. “ఏడుజన్మలకు సరిపడా తిన్నాం” అని చెప్పారట కృష్ణంరాజు. కృష్ణం రాజు పెసరట్టును బాగా ఇష్టంగా తినేవారట. ముఖ్యంగా ఆయన పెద్దక్క చేసే వంటలంటే కృష్ణం రాజుకు చాలా ఇష్టమట. చాలా వంటకాలను ఆవిడ దగ్గర్నుంచి ఆయన నేర్చుకుని.. తన భార్యకు నేర్పించారట.
వంట చేయడం ఎలా నేర్చుకున్నారంటే?
వాస్తవానికి కృష్ణం రాజుకు యంగ్ ఏజ్ లో వంట చేయడం వచ్చేది కాదట. అప్పట్లో ఆయన అప్పుడప్పుడు వేటకు వెళ్లేవారట. పచ్చ పావురాలను పట్టుకునేవారట. వాటిని చాలా ఇష్టంగా తినేవారట. పొద్దున్నే అడవికి వెళ్లి వేటాడేవారట. అక్కడే అడవిలో కొంత మంది ఆయనకు వండి పెట్టేవాళ్లట. అటు కొండ గొర్రె కూడా చాలా బాగుంటుందని చెప్పేవారు కృష్ణం రాజు. అయితే, వేట కోసం అడవికి వెళ్లిన సమయంలో ఒక్కోసారి పులి గాండ్రింపులు వినపడినప్పుడు వంట చేసేవాళ్లు భయపడి పారిపోయేవాళ్లట. అప్పుడు ఆయనే వంట చేసేవారట. అలా నెమ్మదిగా వంట చేయడం నేర్చుకున్నారట. ఆ తర్వాత వంట చేయడంలో నేర్పరిగా మారారట.
చేపల పులుసు చేయడంలో తనకు తానే సాటి!
చేపల పులుసును కృష్ణం రాజు కంటే బాగా ఎవరూ చేయలేరని ఆయన కూతరు ప్రసీద కితాబిచ్చారు. తన తండ్రి చేపల పులుసు వండే వీడియోనో కొంత కాలం క్రితం ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇందులో కృష్ణం రాజు చేపల పులుసు వాసన చూసి కూరలో ఉప్పు తక్కువగా ఉందో? సరిపోయిందో? చెప్పగలను అని అనడాన్ని చూడొచ్చు. వంట చేయడంలో ఆయన ఎంత నేర్పరో ఈ వీడియోను బట్టి తెలుస్తుంది. “వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ప్రపంచంలో ఆయన్ని మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో, లేదో చెప్పేస్తారు. నాన్న అందులో ఎక్స్‌పర్ట్” అని ఆమె చెప్పారు.
చిరంజీవి దోశలు, కృష్ణంరాజు బిర్యానీ
అటు సినిమా షూటింగ్ సమయంలోనే కాదు.. మిగతా సమయాల్లో కూడా కృష్ణంరాజు ఇంటికి క్యారేజీలు వస్తుంటాయట. వీరి ఇంటి నుంచి కూడా పలువురు ఇంటికి వెళ్తుంటాయట. ఈ విషయాన్ని కృష్ణంరాజు భార్య శ్యామల చెప్పారు. చిరంజీవి ఇంట్లో దోశలు బాగుంటాయని ఓసారి కృష్ణం రాజు చెప్పడంతో చిరంజీవి ఆయనకు దోశలతో పాటు రెండు రకాల చట్నీలు పంపించారట. వాటిని ఎంతో ఎంజాయ్ చేస్తూ తిన్నారట కృష్ణం రాజు. ఆ తర్వాత కృష్ణం రాజు ఇంట్లో వండిన బిర్యానీని చిరంజీవి పంపిన క్యారియర్‌లో పెట్టి పంపించారట. ఆ బిర్యానీని చిరంజీవి మధ్యాహ్నం తిని, సాయంత్రం కూడా తింటానని ఉంచమన్నారట. మొత్తంగా భోజనం విషయంలో కృష్ణంరాజు అస్సలు తగ్గేవారు కాదట!
Also Read : సినిమాల్లో రాజుగారి అబ్బాయ్ విలన్ - హీరోగా వరుస విజయాలు - కృష్ణం రాజు కెరీర్‌లో ఇదీ స్పెషల్