Hidden Symptoms of Kidney Disease : కిడ్నీలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని ఫిల్టర్ చేయడం నుంచి ఖనిజాలు, ద్రవాల సమతుల్యతను నిర్వహించడం వరకు ప్రయోజనాలు అందిస్తాయి. కానీ కిడ్నీలు బలహీనపడటం ప్రారంభించినప్పుడు.. శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్ చర్మంపై మొదట కనిపిస్తాయి. ఈ సంకేతాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు మూత్రపిండ వ్యాధిని గుర్తించడానికి ప్రధాన మార్గాలు. అలాగే చర్మంపై జరిగే కొన్ని మార్పులు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని సూచిస్తాయి. అందుకే చర్మంపై జరిగే మార్పులను గమనించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. దీనివల్ల వ్యాధి వేగాన్ని తగ్గించవచ్చంటున్నారు.
చర్మం చాలా పొడిగా మారితే
పొడిబారడం సహజమే కానీ.. చాలా పొడిబారిన, కఠినమైన చర్మం బలహీనమైన కిడ్నీలకు సాధారణ సంకేతం. TOI నివేదిక ప్రకారం.. CKD ఉన్న దాదాపు 72 శాతం మందిలో జెరోసిస్ కనుగొన్నారు. కిడ్నీలు చెమట, నూనె గ్రంథులను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి అవి బలహీనపడినప్పుడు చర్మం పొడిగా మారడం ప్రారంభిస్తుంది. పొడి చర్మం పగుళ్లు ఏర్పడవచ్చు. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.
పరిశోధన ప్రకారం.. కొన్నిసార్లు చర్మం అధికంగా పొడిగా బారడం, పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. దురద లేదా ఇతర లక్షణాలు కనిపిస్తాయి. దీని నుంచి ఉపశమనం పొందడానికి.. ప్రతిరోజూ తేలికపాటి మాయిశ్చరైజర్ ఉపయోగించండి. వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయకండి. కాటన్ దుస్తులు వేసుకుంటే మంచిది. పొడిబారడం ఇంకా ఎక్కువ అయితే మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవడం మంచిది.
దురద ఎక్కువగా ఉంటే
మూత్రపిండాల సమస్యలలో నిరంతరం తీవ్రమైన దురద మరో లక్షణం. శరీరంలో యూరియా వంటి వ్యర్థాలు పెరిగినప్పుడు, చర్మం నరాలు ప్రభావితమవుతాయి. దీనివల్ల దురద పెరుగుతుంది. దాదాపు 56 శాతం మంది CKD రోగులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీరంలో ఫాస్పరస్, PTH స్థాయిలు పెరగడంతో ఇలా జరుగుతుంది. నిరంతరం గోకడం వల్ల చర్మంపై మచ్చలు, పుండ్లు లేదా మందపాటి మచ్చలు ఏర్పడతాయి. కొంతమందిలో దురద చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది నిద్ర, రొటీన్పై కూడా ప్రభావం చూపుతుంది. చికిత్స కోసం వైద్యులు టాపిక్ క్రీమ్, UVB చికిత్స లేదా ఓట్మీల్ బాత్ సిఫార్సు చేస్తారు. అయితే వాటితో మూత్రపిండాల సమస్యను నియంత్రించడం చాలా ముఖ్యం.
దద్దుర్లు లేదా రాష్
కిడ్నీలు మరింత దెబ్బతిన్నప్పుడు.. చర్మంపై దద్దుర్లు లేదా చిన్న చిన్న బొబ్బలు కనిపించవచ్చు. రక్తంలో వ్యర్థాలు పెరిగినప్పుడు చర్మంపై చిన్న, దురద కలిగించే గడ్డలు ఏర్పడతాయి. ఇవి మచ్చలుగా మారతాయి. రాష్, ఊదా మచ్చలు లేదా పుండ్లు కూడా రావచ్చు. కాళ్లపై ఎక్కువగా కనిపిస్తాయి. కాల్సిఫిలాక్సిస్ అనే తీవ్రమైన పరిస్థితి కూడా మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించినదే. దీనివల్ల చర్మం గట్టిగా, పుండ్లుగా మారుతుంది. దాదాపు 43 శాతం మంది CKD రోగులు చర్మంపై ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో కూడా పోరాడుతున్నారు. తేలికపాటి, సువాసన లేని సబ్బును ఉపయోగించడం మంచిది. చర్మాన్ని రుద్దడానికి బదులుగా లైట్గా ప్రెస్ చేయడం వల్ల చికాకు-నొప్పి తగ్గుతుంది. రాష్ పెరిగితే.. నొప్పి లేదా చీము వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.