Best Drinks for Kidney Health : శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించడం, శరీరంలో ద్రవాలు, ఖనిజాల సమతుల్యాన్ని కాపాడటం వంటి కీలక పనులు చేస్తాయి. అందుకే కిడ్నీలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనిలో భాగంగా కిడ్నీలను డిటాక్స్ చేసేందుకు కొన్ని డ్రింక్స్ ఉపయోగపడతాయని సోషల్ మీడియాలో పోస్ట్‌లు, వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిలో ఎంత నిజం ఉంది? ఏ డ్రింక్స్ తాగితే కిడ్నీల ఆరోగ్యానికి మేలు జరుగుతుందో చూద్దాం.
కిడ్నీలను నేరుగా డీటాక్స్ చేసే మ్యాజిక్ డ్రింక్ ఏవి లేవని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యవంతమైన కిడ్నీలు సహజంగానే డీటాక్స్.. తమ పనిని చేస్తాయని అంటున్నారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు తగినంతగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గి.. వాటి పనితీరు మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతుందని చెప్తున్నారు. అవేంటంటే..
మంచి నీరు
కిడ్నీల ఆరోగ్యానికి మంచి నీటికి మించిన పానీయం మరేది లేదని చెప్తారు. రోజంతా తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. అలాగే డీహైడ్రేషన్, కొన్ని రకాల కిడ్నీ రాళ్ల ప్రమాదం కూడా తగ్గవచ్చు. అయితే ఎంత నీరు తాగాలనేది వాతావరణం, ఆరోగ్య పరిస్థితి, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది.
నిమ్మరసం కలిపిన నీరు
గోరువెచ్చని లేదా సాధారణ నీటిలో కొద్దిగా తాజా నిమ్మరసం కలిపి తాగవచ్చు. నిమ్మలో ఉండే సిట్రేట్ కొన్ని రకాల కిడ్నీ రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఇందులో చక్కెర కలపకుండా తాగితే మంచిది.
క్రాన్‌బెర్రీ జ్యూస్
క్రాన్‌బెర్రీలో ఉండే పాలీఫెనాల్స్ మూత్రనాళాల్లో బ్యాక్టీరియా అంటిపెట్టుకునే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. దీనివల్ల కొందరిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్-UTI ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. అయితే చక్కెర కలిపిన జ్యూస్‌కు బదులుగా చక్కెర లేని జ్యూస్‌ను ఎంచుకోవాలి.
బార్లీ నీళ్లు
బార్లీ నీరు శరీరానికి తేమను అందించే మంచి పానీయాల్లో ఒకటి. చక్కెర, ఉప్పు కలపకుండా తీసుకుంటే శరీరంలో ద్రవాల సమతుల్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. కిడ్నీల పనితీరుకు తగినంత హైడ్రేషన్ చాలా ముఖ్యం.
మందార టీ
మందార పూలతో తయారుచేసే హెర్బల్ టీ యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు ఇది రక్తపోటు నియంత్రణకు కొంతమేర సహాయపడవచ్చని సూచిస్తున్నాయి. అధిక రక్తపోటు కిడ్నీ వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి.
ఇన్ఫ్యూజ్డ్ వాటర్
నీటిలో దోసకాయ ముక్కలు, నిమ్మ ముక్కలు లేదా పుదీనా ఆకులు వేసి తాగడం వల్ల నీరు ఎక్కువగా తాగే అలవాటు పెరుగుతుంది. షుగర్స్ ఉండే కూల్‌డ్రింక్స్‌కు బదులుగా వీటిని తీసుకోవచ్చు.
కొబ్బరి నీరు, మజ్జిగ కూడీ డీహైడ్రేషన్ తగ్గించి.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కానీ వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేయవచ్చు. అలా అని ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు.
తాగకూడనివి..
కిడ్నీల ఆరోగ్యానికి హెల్తీ డ్రింక్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని డ్రింక్స్‌కి దూరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. చక్కెర ఎక్కువగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, అధిక చక్కెర కలిగిన ప్యాక్డ్ జ్యూస్, అధిక ఉప్పు ఉన్న ఇన్‌స్టంట్ డ్రింక్స్, ఆల్కహాల్‌ను అధికంగా తీసుకోవడం మంచిది కాదని చెప్తారు. ఎందుకంటే ఇవి ఇవి కిడ్నీలపై అదనపు ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.
కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్లు
కిడ్నీల ఆరోగ్యానికి రోజూవారి అలవాట్లు కీలకపాత్ర పోషిస్తాయని చెప్తున్నారు నిపుణులు. రోజూ తగినంత నీరు తాగాలి. అలాగే ఉప్పు వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. రక్తపోటు, డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకుంటూ.. ధూమపానానికి దూరంగా ఉండాలని అంటున్నారు. అవసరం లేని నొప్పి పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. అలాగే సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
