Karthika Masam Vegetable Biryani Recipe : కార్తీకమాసంలో చాలామంది వెజ్ మాత్రమే తింటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీరు టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీని చేసుకుని తినొచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లి తినను అనుకునేవారు వాటిని అవాయిడ్ చేసి.. ఈ టేస్టీ వెజిటేబుల్ రైస్‌ని తినొచ్చు. ఈ హెల్తీ వెజిటేబుల్ రైస్‌ని తింటే ఇతర క్రేవింగ్స్ దూరమవుతాయి. పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ టేస్టీ రెసిపీని ఏవిధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - ఒకటిన్నర గ్లాసు
పచ్చిమిర్చి - 3
టమాటా - 1
క్యారెట్స్ - 1
బంగాళ దుంపలు - 1
ముల్లంగి - 5 ముక్కలు
బీన్స్ - గుప్పెడు
బఠాణీలు - పావు కప్పు
ఉల్లిపాయ - 1
బిర్యానీ ఆకు - 1
షాజీరా -1 టీస్పూన్
దాల్చిన చెక్క - 2 అంగుళాలు
మరాఠీ మొగ్గలు - 2
జాజిపువ్వు - 1
జాపత్రి - 1
యాలకులు -2
లవంగాలు - 2
నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - గుప్పెడు
ఉప్పు - రుచికి తగినంత
బిర్యానీ మసాలా పొడి - 1 టేబుల్ స్పూన్
పుదీనా - గుప్పెడు
కొత్తిమీర - గుప్పెడు
గరం మసాలా -1 టీస్పూన్
తయారీ విధానం
బియ్యాన్ని రెండు సార్లు కడగాలి. దానిలో నీళ్లు వేసి అరగంట నానబెట్టుకోవాలి. అనంతరం కూరగాయలన్నీ సిద్ధం చేసుకోవాలి. బిర్యానీ మసాలాను కూడా రెడీ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేసుకుంటే మంచిది. బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. లోతైన కడాయి పెట్టాలి. దానిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకుంటే నూనె కూడా వేసుకుని ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు.
నెయ్యి కాగిన తర్వాత దానిలో బిర్యానీ మసాలా దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. అవి కాసేపు వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత బంగాళ దుంపలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, టోమాటో వేసుకుని ఉడికించుకోవాలి. అనంతరం దానిలో బఠాణీలు వేసుకోవాలి. ఇవన్నీ మగ్గుతున్న సమయంలో కాస్త ఉప్పు వేయాలి. దీనివల్ల కూరగాయలు మెత్తగా ఉడుకుతాయి.
కూరగాయలు ఉడికిన తర్వాత దానిలో నీళ్లు వేసుకోవాలి. గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర నీటిని తీసుకోవాలి. ఇలా నీరు వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని.. దానిలో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరిగేవరకు చూడాలి. దానిలో బిర్యానీ మసాలా వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత దానిలో నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. పెద్దమంట మీద రెండు నిమిషాలు ఉంచి.. బియ్యం ఉడుకుతున్న సమయంలో మంట తగ్గించేయాలి.
ఉడుకుతున్న రైస్‌లో గరం మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దానిపై మూత పెట్టి.. మొత్తం ఉడికేవరకు స్టౌవ్‌పై ఉంచాలి. రైస్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చివర్లో కొత్తిమీర, పుదీనా వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. చివర్లో ఓ స్పూన్ నూనె వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కార్తీక మాసంలో హాయిగా వెజిటేబుల్ రైస్ చేసుకుని.. లంచ్‌కి లాగించేయండి.
Also Read : కార్తీకమాసంలో వారు ఉపవాసం చేయకపోవడమే మంచిదట, కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే