మధుమేహలు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. మరి కొన్నింటిని ఇష్టంగా తినాలి. అలా ఇష్టంగా తినే వాటిలో కాకరకాయ కూడా ఒకటి. ఇది చేదుగా ఉన్నా కూడా ఆరోగ్యం కోసం వారు కచ్చితంగా కాకరకాయను తినాల్సిందే. రోజూ కాకరకాయ కూర, కాకరకాయ వేపుడు తినడం కష్టం కావచ్చు. కానీ కాకరకాయ పొడి మాత్రం ఈజీగా తినేస్తారు. దీని రుచి కూడా అదిరిపోతుంది. అలాగే రోజూ ప్రత్యేకంగా వండుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దీన్ని చేసి పెట్టుకుంటే నెలలు తరబడి నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ పొడి వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.


కావాల్సిన పదార్థాలు
కాకరకాయలు - నాలుగు 
చింతపండు - చిన్న ఉండ 
వెల్లుల్లి రెబ్బలు - ఐదు 
ధనియాలు - అర స్పూను 
మినప్పప్పు - ఒక స్పూను 
ఎండుమిర్చి - పది 
శనగపప్పు - ఒక స్పూన్ 
ఉప్పు - రుచికి సరిపడా 
నూనె - రెండు స్పూన్లు


తయారీ ఇలా
కాకరకాయల్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి పాన్లో కాస్త నూనె వేసి ఈ ముక్కల్ని వేయించాలి. నీరు అంతా దిగి అవి పొడిగా మారేవరకు వేయించాలి. వాటి రంగు కూడా మారుతుంది. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మినప్పప్పు, శెనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ధనియాలు కూడా వేసి బాగా వేయించాలి. ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీలో వాటిని వేసి పొడిగా మార్చుకోవాలి. అందులో ఉప్పు, కాకరకాయ ముక్కలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే కాకరకాయ పొడి సిద్దమైనట్టే. దీన్ని గాలి చొరబడని కంటైనర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా తాజాగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం, రాత్రి ఆహారంలో ఈ కాకరకాయ పొడితో రెండు ముద్దలు తింటే ఎంతో ఆరోగ్యం.


కాకరకాయ తినడం వల్ల ఎంతో ఆరోగ్యం. కాకరకాయ తింటే డయాబెటిక్ రోగులకు ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాకరకాయ అడ్డుకుంటుంది. ఈ కూరగాయను తరచూ తినడం వల్ల మలేరియా, టైఫాయిడ్ వంటివి రాకుండా ఉంటాయి. తరచూ కాకరకాయ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.దీన్ని తినడం వల్ల ఫైబర్ అధికంగా శరీరంలో చేరుతుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటివి రాకుండా ఉంటాయి. చర్మం మెరవాలంటే కాకరాకాయ జ్యూస్ రోజూ తాగండి. గ్లాసుడు జ్యూస్ తాగక్కర్లేదు. నాలుగైదు స్పూన్లు తాగితే చాలు. అధిక బరువును అదుపులో ఉంచాలన్నా కూడా కాకరకాయ తినడం అలవాటు చేసుకోవాలి. 


Also read: మీ చెమట దుర్వాసన వస్తుందా? అయితే వీటిని తినడం తగ్గించండి




Also read: ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైనదిగా అధికారికంగా గుర్తింపు తెచ్చుకున్న ఆకుకూర ఇదే




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.