Diarrhea Deaths : అతిసారంతో కేవలం 8 రోజుల్లోనే నలుగురు చనిపోయిన ఘటన జార్ఖండ్​లోని దుమ్కా జిల్లాలో చోటు చేసుకుంది. మరికొందరు అనారోగ్యానికి గురైనట్లు గుర్తించి.. జిల్లా యంత్రాంగం అత్యవసర వైద్య సహాయం అందిస్తుంది. కలుషితమైన తాగునీరే దీనికి ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ అనుమానిస్తుంది. వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధుల్లో ఈ డయేరియా ఒకటి. దీని గురించి ప్రజలకు కచ్చితంగా అవగాహన ఉండాలి. లేకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

డయేరియా.. 

డయేరియానే అతిసారం అని అంటారు. అంటే విరేచనాలు కావడం. సాధారణం కంటే ఎక్కువసార్లు నీళ్ల విరేచనాలు అవుతాయి. ఈ సమస్య చాలా సాధారణమైనది. కానీ కొన్నిసార్లు ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. సాధారణంగా విరేచనాలు ఒక్కరోజులో తగ్గిపోతాయి. అలా కాకుండా రెండు రోజులకు పైగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే అది డయేరియాకు సంకేతం కావచ్చు. 

కారణాలివే..

వర్షాకాలంలో డయేరియా పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ సమయంలో నీరు ఎక్కువగా కలుషితం చెందుతుంది. తాగునీరు కలుషితం కావడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండడం, చెడిపోయిన ఆహారం తినడం, కడుపునకు సబంధించిన ఇన్​ఫెక్షన్లు అతిసారంకు దారితీస్తాయి. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్​ఫెక్షన్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. శుభ్రంగా ఉండకపోవడం, స్ట్రీట్ ఫుడ్ తినడం వంటివి కూడా డయేరియాకు కారణమవుతాయి. 

డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నీటి విషయంలో : డయేరియా రాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో కచ్చితంగా నీటిని వేడి చేసి తీసుకోవాలి. లేదా ఫిల్టర్ చేసిన నీటిని తాగినా మంచిది. ట్యాప్ వాటర్ తాగకపోవడమే మంచిది. బయటకు వెళ్లేప్పుడు మీ బాటిల్ వాటర్ తీసుకెళ్తే మంచిది. బయట దొరికే ఐస్​కి దూరంగా ఉండాలి. 

ఆహార జాగ్రత్తలు : ఫ్రెష్​గా, ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్ తీసుకోవడం మంచిది. మిగిలిపోయిన ఫుడ్స్, ఫ్రిడ్జ్​లో పెట్టని ఫుడ్స్ తీసుకోకూడదు. పచ్చివి, సరిగ్గా ఉడికించని మాంసానికి దూరంగా ఉండాలి. బయట దొరికే సలాడ్స్, కట్ చేసిన పండ్లు తినకూడదు. పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి ఉపయోగించావి. స్ట్రీట్ ఫుడ్ తినకూడదు. 

శుభ్రత : ఆహారం తీసుకునే ముందు, వాష్ రూమ్ వినియోగించిన తర్వాత కచ్చితంగా చేతులు కడుక్కోవాలి. అలాగే భోజనం చేసేముందు కూడా కచ్చితంగా నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్ కూడా ఉపయోగించవచ్చు. గోళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వాటిలో ఎక్కువ క్రిములు ఉంటాయి. కిచెన్​ను కూడా శుభ్రం చేసుకోవాలి. వంట చేసుకునే ప్రదేశం ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. 

వీటితో పాటు గట్ బ్యాక్టీరియాను మెరుగుపరిచే ప్రొబయోటిక్స్ తీసుకోవాలి. పెరుగు రూపంలో కాకుండా మజ్జిగ చేసుకుని తాగవచ్చు. అల్లం, జీలకర్ర, వామ్ము వంటివి ఫుడ్స్​లో తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. హైడ్రేషన్ చాలా ముఖ్యం కాబట్టి నీటిని తాగుతూ ఉండండి. విరేచనాలు ఎక్కువగా అవుతూ.. రోజుకి మించి ఉంటే కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాలి. సమస్యను ఆలస్యం చేస్తే ప్రమాదమవుతుందని గుర్తించుకోవాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.