తల్లి తొమ్మిది నెలల పాటు బిడ్డని కడుపులో మోసి ప్రాణాలను పణంగా పెట్టి ప్రసవ వేదన మధ్య తన ప్రతిరూపానికి జన్మనిస్తుంది. అప్పటి వరకు భరించిన ప్రసవ వేదన పొత్తిళ్లలో ఉన్న బిడ్డని చూడగానే గుర్తుకు రాదు. అటువంటి మధురానుభూతి కోసం ప్రతి మహిళ తపిస్తుంది. కానీ గర్భసంచిలో సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కొంతమందికి ఆ అదృష్టం లేక ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా బిడ్డలను పొందగలుగుతున్నారు. అయితే ఇక మీదట బిడ్డను కనాలంటే తల్లి గర్భమే అవసరం లేదని అంటున్నారు జపాన్ పరిశోధకులు. ల్యాబొరేటరీలోనే శిశువులని అభివృద్ధి చేసే ఒక పద్ధతి మీద జపాన్ పరిశోధకులు కసరత్తులు చేస్తున్నారు. అది కనుక విజయవంతమైతే  2028 నాటికి ల్యాబ్ లోనే ఇక పిల్లలు ప్రాణం పోసుకుంటారు. వంధ్యత్వం, బిడ్డలను కనలేని వారికి ఇదొక గొప్ప అవకాశంగా మారబోతోంది.


ఎలుకల మీద సక్సెస్.. 


క్యుషు విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపిన దాని ప్రకారం మానవ కణాల నుంచి స్మెర్మ్, గుడ్లు తీసుకుని వాటిని భద్రపరిచి పిండాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేచర్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పరిశోధకుల బృందం మగ ఎలుకల చర్మ కణాలను ఫ్లూరిపోటెంట్ మూలకణాలను మార్చే పద్ధతి పరిశీలించారు. ఇవి వివధ రకాల కణాలు లేదా కణజాలాలుగా అభివృద్ధి చెందగలవు. మగ ఎలుకల మూలకణాలను ఆడ కణాలుగా మార్చే ఔషధంతో వాళ్ళు ఈ కణాలను కలిపి పెంచారు. ఇది అండాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ గుడ్లు నవజాత మగ ఎలుకలను ఉత్పత్తి చేయడానికి ఫలదీకరణం చేయబడతాయి.


గతంలో ఇదే పరిశోధన చేసిన్ బృందం రెండు మగ ఎలుకల నుంచి శిశువు ఎలుకల్ని సృష్టించేందుకు సింథటిక్ సరోగసీ పద్ధతిని ఉపయోగించింది. కొత్త అధ్యయనం ప్రకారం 630 పిండాలలో ఏడు మాత్రమే పిల్లలుగా మారాయి. ఈ ప్రయోగం మానవ పునరుత్పత్తిలో చేయాలంటే కొన్ని సమస్యలు అధిగమించాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది మూల కణం, పునరుత్పత్తి జీవశాస్త్రం రెండింటిలోనూ ముఖ్యమైన దశ. వాస్తవానికి ఫ్లూరిపోటెంట్ మూలకణాల ద్వారా  వచ్చిన పిండాలను ఆడ గర్భంలోకి చొప్పించడం ద్వారా పిండం అభివృద్ధి జరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఐవీఎఫ్ పద్ధతి మాదిరిగానే ఉంటుంది.


ఈ కృత్రిమ పునరుత్పత్తి పద్ధతిని క్లినిక్ లో ఉపయోగించడం కోసం 10-20 సంవత్సరాల పాటు పరీక్షలు చేయాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది పూర్తిగా సాంకేతిక పరంగా జరుగుతుంది. పదేళ్ళలో మానవులలో కూడా ఈ పద్ధతి సాధ్యమవుతుందని పరిశోధక బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. గతంలో ఇలాంటిదే ఆలోచన ఒకటి బయటకి వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 'కృత్రిమ గర్భ కర్మాగారం' సిద్ధమవుతోంది. ఇందులో ఫలదీకరణం నుంచి తొమ్మిది నెలల వరకు ఈ బిడ్డ కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. తల్లికి నొప్పులు పడే బాధ కూడ లేదు. కృత్రిమ గర్భం తెరను తీసి బిడ్డను బయటికి తీస్తారు. తరువాత ఆ గర్భంలో మరో బిడ్డను పెంచడం మొదలుపెడతారు. ఇలా ఏడాదికి 30,000 బిడ్డలను సృష్టించేందుకు వీలుగా అతి పెద్ద ల్యాబ్ నిర్మితమవుతోంది. ఈ 'కృత్రిమ గర్భ కర్మాగారం' పేరు ఎక్టో లైఫ్. బెర్లిన్‌కు చెందిన బయోటెక్నాలజిస్టు హషేమ్ అల్ ఘైలీ దీని సృష్టికర్త.  సంతానం లేని తల్లిదండ్రుల కోసం ఈ ల్యాబ్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారాయన. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది