ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఏడు గంటల నిద్రపోవాలని వైద్యులు చెబుతారు. సరైన నిద్రలేకపోతే అనేక రోగాలు దాడి చేస్తాయని అంటారు. అయితే, ఈ వ్యక్తి మాత్రం రోజుకు అరగంట నిద్రపోతే చాలని అంటున్నాడు. వామ్మో.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? సరిగా నిద్రపోనట్లయితే.. తప్పకుండా మైకం కమ్ముతుంది. ఆ రోజంతా నిరసంగా.. తల పట్టేసినట్లుగా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు కూడా. మరి, ఆ వ్యక్తి 12 ఏళ్లుగా కేవలం అరగంట సేపే నిద్రపోతున్నా.. ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవిస్తున్నాడు.
జపాన్‌కు చెందిన ఆ వ్యక్తి పేరు డైసుకే హోరి. వయస్సు 36 ఏళ్లు. చిత్రం ఏమిటంటే.. ఆరోగ్యంగా ఉండటం కోసమే తాను రోజుకు 30 నిమిషాలు నిద్రపోతున్నానని చెబుతున్నాడు. తక్కువ సమయం నిద్రపోవడం వల్ల తాను ఏ రోజు అలసటకు గురికాలేదని చెబుతున్నాడు. ‘జపాన్ షార్ట్ స్లీపర్ అసోసియేషన్’కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న హోరీ.. వందలాది మందికి ఇందులో శిక్షణ ఇస్తున్నాడు. తక్కువసేపు నిద్రపోతూ.. రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు చిట్కాలు చెబుతున్నాడు.
ఒక రోజు మొత్తం గడిపేందుకు 16 గంటలు చాలా తక్కువ అని, మిగతా గంటలను నిద్ర ద్వారా వేస్ట్ చేస్తున్నామని హోరీ అంటున్నాడు. అందుకే తాను నెమ్మది నెమ్మదిగా నిద్రపోవడం తగ్గిస్తూ వచ్చానని తెలిపాడు. ఇదివరకు తాను రోజుకు 8 గంటలు నిద్రపోయేవాడనని, ఇప్పుడు ఆ సమయాన్ని 30 నిమిషాలకు తగ్గించానని పేర్కొన్నాడు. రోజులో తాను అరగంట మాత్రమే నిద్రపోయినా.. ఆరోగ్యంగా, ఉత్సాహంగానే ఉంటున్నానని తెలిపాడు. ఒక్కోసారి 30 నిమిషాల కంటే తక్కువ సమయమే నిద్రపోతానన్నాడు.
హోరీ చెబుతున్నది నిజమా.. కాదా అని తెలుసుకుందామని జపాన్‌కు చెందిన ఓ టీవీ చానెల్ మూడు రోజులుపాటు నిఘా పెట్టింది. కేవలం అరగంటే నిద్రపోయి.. అలసట లేకుండా ఎలా జీవిస్తున్నాడో తెలుసుకోడానికి ప్రయత్నించింది. మొదటి రోజు అతడు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు నిద్రపోయాడు. ఏ అలారం లేకుండానే 26 నిమిషాల తర్వాత నిద్రలేచాడు. ఆ తర్వాత దుస్తులు ధరించి.. సర్ఫింగ్‌కు వెళ్లాడు. మూడు రోజుల పాటు అతడు అరగంట తక్కువ సమయమే నిద్రపోతూ ఉత్సాహంగా గడిపాడు.
హోరీ రాత్రంతా నిద్రపోకుండా వీడియో గేమ్స్ ఆడుతూ గడిపాడని, ఆ తర్వాత తనలాగే తక్కువ సమయం నిద్రపోయే స్నేహితులతో కలిసి సర్ఫింగ్‌కు వెళ్లాడని ఆ టీవీలో ప్రసారమైన షోలో తెలిపారు. చిత్రం ఏమిటంటే అతడి స్నేహితులు కూడా హోరీ తరహాలోనే తక్కువ సమయం నిద్రపోయేలా శిక్షణ పొందారు. వారంతా హోరీతో కలిసి నిద్రపోకుండా టైంపాస్ చేయడాన్ని అలవాటు చేసుకున్నారట. సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత ఇన్సులిన్ ప్రభావం వల్ల తెలియకుండానే మత్తు వస్తుంది. మరి, ఈ పరిస్థితిని హోరీ ఎలా ఎదుర్కొంటున్నాడని తెలుసుకోవాలని చాలామంది ఎదురుచూశారు.
Also Read: పాము కాటేసినా ముంగిసకు ఏమీ కాదు ఎందుకు? కారణం ఇదే..
తిన్న తర్వాత వచ్చే మత్తును.. హోరీ కెఫిన్ పదార్థాలను తీసుకోవడం ద్వారా అదిగమిస్తున్నాడని తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు. గత 12 ఏళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నం వల్లనే తాను రోజులో 30 నిమిషాలు మాత్రమే నిద్రపోగలుగుతున్నానని హోరీ ఈ సందర్భంగా చెప్పాడు. అయితే మీరు మాత్రం హోరీలా నిద్రపోకుండా ఆరోగ్యంతో ప్రయోగాలు చేయొద్దు. దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, నిద్రలేకపోయినా.. హోరీ ఎలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటున్నాడనేది ఇంకా తేలాల్సి ఉంది. అతడు తనని తాను నియంత్రించుకోవడం, వ్యాయామం చేయడం, తగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడని, 12 ఏళ్ల ప్రయత్నం వల్ల అతడి శరీరం కూడా అతడి దినచర్యకు అలవాటుపడి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read: విమానం మధ్య సీట్లోని ఆర్మ్‌రెస్ట్ ఎవరు ఉపయోగించాలో తెలుసా?