Egg Yolk: రోజుకో గుడ్డు తింటే ఎంతో బలం. రోజుకో గుడ్డు తిన్నవాళ్లు వైద్యులను కలిసే అవసరం కూడా తగ్గుతుందని అంటారు పెద్దలు. నిజమే గుడ్డు చాలా ఆరోగ్యకరం. కానీ కొందరిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. గుడ్డులోని పచ్చసొన తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని, దాని వల్ల అధిక బరువు పెరుగుతారని ఒక నమ్మకం. అలాగే గుడ్డులోని పచ్చసొన తినడం అనారోగ్యమని నమ్మేవాళ్లు ఉన్నారు. అందుకోసం దాన్ని పూర్తిగా తీసి పక్కన పడేసే వాళ్లు ఎంతో మంది. ఇది నిజమేనా? పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఎవరు తినకూడదు? ఈ విషయాలపై ఆరోగ్య నిపుణులు ఓ క్లారిటీ ఇచ్చారు. 


పచ్చసొన మంచిదే...
ముందుగా గుడ్డులోని పచ్చసొన మంచిది కాదు అనే అభిప్రాయం ఉంటే దాన్ని ముందు మీ ఆలోచనల నుంచి తొలగించండి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లకి తప్ప ఆరోగ్యంగా ఉన్న అందరికీ పచ్చసొన మంచిదే. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, గర్భిణిలకు పచ్చసొన తినడం చాలా ముఖ్యం. దీనిలో రిబోఫ్లేవిన్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలకు, మానసిక ఆరోగ్యానికి అవసరం. హార్మోన్లు సక్రమంగా పనిచేయాలన్న కూడా విటమిన్ అత్యవసరం. బి12 కూడా అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకమైనది. పచ్చసొన తినడం పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజుకో ఒక గుడ్డు పచ్చసొన తినడం జరిగిపోయే అనర్థాలేవీ లేవు. ఆరోగ్యవంతులైనా వాళ్లు రోజూ గుడ్డును పచ్చసొనతో పాటూ తినవచ్చు. పిల్లలకు పెట్టవచ్చు. 


ఎవరు తినకూడదు?
ఊబకాయం బారిన పడి అధిక కొలెస్ట్రాల్‌తో బాధ పడుతున్న వారు పచ్చసొనను పక్కనపెట్టడం మంచిదే. ఒక గుడ్డు పచ్చసొనలో 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది.  అలాగే గుండె జబ్బుల బారిన పడిన వారు రోజుకో గుడ్డును పచ్చసొనతో కలిపి తినవచ్చు. అంతకుమించి తినకపోవడమే మంచిది. అది కూడా వైద్యుల సూచన మేరకు తినాలి. ఇక మధుమేహంతో బాధపడుతున్నవారు. రోజులో రెండు గుడ్లు కన్నా అధికంగా తినకపోవడమే మంచిది. వీరు గుడ్డు పచ్చసొనను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యుల అనుమతితో గుడ్డు తినడం ఉత్తమం. 


గుడ్డులో ఏముంటాయి?
గుడ్డు తినమని, అది చాలా బలవర్ధకమని ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భిణులకు, పిల్లలకు అంగన్వాడీల ద్వారా గుడ్లును ప్రత్యేకంగా అందజేస్తున్నాయి. దానికి కారణం గుడ్డులో ఉండే పోషకాలే. ఒక్కో గుడ్డు సగటున 65 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని ఉడికించి తింటే శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా అందుతాయి. అలాగే ఆరుగ్రాములకు పైగా ప్రొటీన్ అందుతుంది. 78 క్యాలరీలు అందుతాయి. రోజుకో గుడ్డు తింటే చాలు శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. 


Also read: మహిళలూ జాగ్రత్త, వాయు కాలుష్యానికి గురైతే త్వరగా లావైపోతారట మీరు


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.