కొన్ని తెగల ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రపంచానికి వారు చేసే పనులు, విధానాలు తప్పుగా కనిపించవచ్చు, కానీ వారి దృష్టిలో మాత్రం అవి ఆచారాలు, సంప్రదాయాలు. తప్పకుండా పాటించాల్సిన నియమాలు కూడా. అలాంటి ఓ విచిత్రమైన ఆచారం కలిగిన తెగ బచ్చారా. మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వీరు చాలా తక్కువ సంఖ్యలో జీవిస్తున్నారు. ఈ తెగ కుటుంబాల్లో పుట్టిన తొలి ఆడపిల్లని వ్యభిచార వృత్తిలోకి దింపుతారు. ఆమెకు కేవలం పన్నేండేళ్ల వయసు వచ్చేసరికే వేశ్యగా మారుస్తారు. ఈ పరిస్థితి మారాలని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పోరాటాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఆ తెగ పెద్దల్లో మార్పు తెచ్చేందుకు ఎన్నో ఎన్జీవోలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పటికే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు వ్యభిచార కూపంలోనే మగ్గిపోతున్నాయి.


తరతరాలుగా...
ఆ తెగ పెద్దలు మాట్లాడుతూ ఇది తమకు తరతరాలుగా వస్తున్న ఆచారమని, దాన్ని వదులుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఆడపిల్లలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆచారాలకు తలవంచాల్సిందేనని అంటున్నారు. వీరి పేదరికమే వీరి చేత ఈ ఆచారాలను అనుసరించేలా చేస్తోందని అంటున్నారు ఎన్జీవో కార్యకర్తలు. సంచార జాతికి చెందిన ఈ బచ్చరా తెగ ప్రజలకు ఆడపిల్లలే సంపాదనపరులు. వారు వ్యభిచారం ద్వారా సంపాదించే డబ్బులతోనే ఇంటి అవసరాలు గడుస్తాయి. ఇంట్లో పుట్టిన మొదటి ఆడపిల్ల చేతే ఈ పని చేయిస్తారు. ఆమె వయసైపోతే, తరువాత పుట్టిన ఆడపిల్లను ఈ ఆచారంలోకి దించుతారు. తండ్రి, సోదరులే విటులను ఇంటికి తీసుకొస్తుంటారు. 


పెళ్లిళ్లు అవుతాయి...
వ్యభిచారం చేసిన అమ్మాయిలను తెగలోని అబ్బాయిలెవరూ పెళ్లి చేసుకోరు. వారి జీవితం అలా ముగిసిపోవాల్సిందే, వారి కుటుంబంలో ఇతర ఆడపిల్లలకు మాత్రం యథావిధిగా పెళ్లిళ్లు అవుతాయి. ఎదురు కట్నాలిచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి ఖర్చు కూడా ఆ కుటుంబంలో వేశ్యాగా మారిన పెద్ద కూతురే భరించాలి. 


ఎయిడ్స్ రోగులు...
ఈ తెగలోని వారి ఎయిడ్స్ రోగులు అధికంగానే ఉన్నారు. వీరి తెగలో ఉండే జనాభా చాలా తక్కువ. వారిలో కూడా 15 శాతం మందికి హెచ్ఐవీ సోకినట్టు గుర్తించారు. చాలా మంది ఆడపిల్లలకు చిన్న వయసులోనే పిల్లలు పుడతారు. ఆ పిల్లల తండ్రులెవరో వారికి కూడా తెలియదు.  ఆరోగ్య సమస్యల భయంతో ఇప్పుడిప్పుడే కొంత మంది ఆడపిల్లలు వ్యవస్థపై తిరగబడుతున్నారు. అలాంటివారిని తెగలోంచి పంపించేస్తున్నారు. 


ఈ తెగలో ప్రస్తుతం 33000 మంది జనాభా ఉండగా, వారిలో 65 శాతం మంది ఆడపిల్లలే ఉన్నారు. ఎన్జీవోలు ఇక్కడ్నించి కొంతమంది ఆడపిల్లల్ని రక్షించాయి. కానీ మార్పు రావాల్సింది ఆ తెగలోని పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వారిలో. ఈజీ మనీకి అలవాటు పడిన మగవారు ఆడవారికి ఆ పని నుంచి బయట పడనివ్వడం లేదు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో బలమైన చట్టాలు చేసినప్పటికీ ఈ తెగలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. 


Also read: కరోనా వచ్చి తగ్గిన వారిలో కొనసాగుతున్న లాంగ్ కోవిడ్, ఈ లక్షణాలు ఉంటే లాంగ్ కోవిడే


Also read: వేసవిలో ఐస్‌క్రీములు లాగిస్తున్నారా? మెదడుపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?