Isabgol Benefits : ఇసబ్గోల్ (Psyllium Husk) గురించి ఎక్కువమందికి తెలియదు. కానీ దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, విరేచనాలతో పాటు కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం. పరిశోధనలు ఏమంటున్నాయి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం.
ఇసబ్గోల్ అంటే..
ఇసబ్గోల్ (Psyllium Husk) అనేది Plantago ovata అనే మొక్క విత్తనాల నుంచి సహజంగా ద్రవీభవించే ఫైబర్ (Soluble Fiber). దీనిని నీటిలో వేస్తే.. నీటిని పీల్చుకుని జెల్లా మారుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో మంచి ఫలితాలు ఇస్తుందని ICMR, FDA, WHO తెలిపాయి. దీనిని ఆహార ఫైబర్‌గా గుర్తించాయి. దీనిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటంటే..
మలబద్ధకం (Constipation) దూరం
ఇసబ్గోల్ తీసుకుంటే మలబద్ధకం తగ్గి.. మల విసర్జన సులభమవుతుంది. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు మొదటి చికిత్సగా సూచించే ఫైబర్ దీనిలో ఉంది. రాత్రి పడుకునే ముందు రెండు టీస్పూన్ల ఇసబ్గోల్ నీటిలో నానబెట్టి తింటే ఉదయానికి రిఫ్రెష్‌గా ఉంటుంది.
విరేచనాలు (Diarrhea)
విరేచనాలతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది పేగుల్లోని అదనపు నీటిని పీల్చుకుని విరేచనాలను అదుపు చేస్తుంది. అంటే మీరు ఏ సమస్యతో దీనిని తీసుకున్నా.. దానికి అనువుగా శరీరానికి తగ్గట్లు ఇసబ్గోల్ పని చేస్తుంది. విరేచనాలు తగ్గించడానికి 1 టీస్పూన్ ఇసబ్గోల్ రోజుకి రెండుసార్లు తీసుకోవాలి.
కొలెస్ట్రాల్ తగ్గించడంలో..
ఇసబ్గోల్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడేవారు రోజుకి 3.4 గ్రాములు రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. షుగర్‌ను (Diabetes) నియంత్రణలో ఉంచుతుంది. గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి.. భోజనం తర్వాత షుగర్ స్పైక్స్ తగ్గిస్తాయని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపింది. కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చి అతిగా తినడాన్ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఒబెసిటీ తగ్గించుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. మధుమేహంతో పాటు బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి మందు ఇసబ్గోల్ తీసుకోవచ్చు.
పైల్స్ (Hemorrhoids)
పైల్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని తీసుకోవచ్చు. దీనివల్ల రక్తస్రావం, నొప్పి తగ్గుతాయి. గట్ డీటాక్స్ అవుతుంది. అసిడిటీ తగ్గుతుంది. పేగు ఆరోగ్యం మెరుగై.. గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి.
మరిన్ని ప్రయోజనాలు
ఐబీఎస్ (IBS – Irritable Bowel Syndrome) సమస్యను దూరం చేస్తుంది. పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. మల విసర్జనలో ఇబ్బందులు తగ్గుతాయి. పేగులకు సౌకర్యాన్ని ఇస్తుందని American College of Gastroenterology తెలిపింది.
ఇసబ్గోల్ ఎలా తీసుకోవాలంటే..
ఇసబ్గోల్ రోజుకి 1–2 టీస్పూన్లు.. రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు. దీనిని గోరువెచ్చని నీరు, పాలు లేదా పెరుగుతో తీసుకోవచ్చు. మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు రాత్రి, షుగర్ / బరువు తగ్గాలనుకుంటే భోజనానికి ముందు తీసుకోవాలి.
ఎవరు దూరంగా ఉండాలంటే..
పేగుల్లో అడ్డంకులు ఉన్నవారు, మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నీరు సరిగ్గా తాగనివారు దీనికి దూరంగా ఉంటే మంచిది. అలాగే తప్పుగా తాగితే పొట్ట ఉబ్బరం పెరుగుతుంది. గ్యాస్ వస్తుంది. నీరు లేకుండా తీసుకుంటే గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని ఎక్కువ నీటితోనే తీసుకోవాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.