KCR Assembly Politics:   తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాకపై బీఆర్ఎస్ శ్రేణులు భారీ అంచనాలు పెట్టుకున్నాయి.  గులాబీ బాస్ వస్తున్నారు.. సభలో కాంగ్రెస్ తోలు తీస్తారు అంటూ పార్టీ నేతలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే, కేసీఆర్ సభకు వచ్చి కేవలం హాజరు పట్టీపై సంతకం చేసి, నిమిషాల వ్యవధిలోనే వెనుదిరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  

Continues below advertisement

అనర్హత వేటు భయమేనా? 

కేసీఆర్ అసెంబ్లీకి రావడం వెనుక ప్రజా సమస్యల కంటే  సాంకేతిక కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా సభకు హాజరుకాకపోతే సభ్యత్వంపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. దీనిని నివారించేందుకే ఆయన మొక్కుబడిగా వచ్చి సంతకం పెట్టి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. సభలో చర్చల్లో పాల్గొనకుండా, ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేయకుండా కేసీఆర్ దూరంగా ఉండటం ఆయన కేడర్‌లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి  మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే కేసీఆర్ పారిపోతున్నారు  అని ప్రచారం చేసుకునేందుకు అస్త్రంగా దొరికింది.

Continues below advertisement

కాంగ్రెస్‌కు లభిస్తున్న రాజకీయ వెసులుబాటు 

కేసీఆర్ సభకు రాకపోవడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ,  కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.  సభలో కేసీఆర్ లాంటి సీనియర్ నేత ఉంటే చర్చల దిశను మార్చే అవకాశం ఉంటుంది. ఆయన లేకపోవడంతో కాంగ్రెస్ మంత్రులు స్వేచ్ఛగా గత ప్రభుత్వ లోపాలను ఎండగట్టేందుకు ప్రయత్నిస్తారు.  ప్రజా సమస్యలపై నిలదీయాల్సిన బాధ్యత ఉన్న ప్రతిపక్ష నేత సభకు రాకపోవడాన్ని కాంగ్రెస్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.  ప్రజలు గెలిపించింది సంతకాలు పెట్టడానికా.. సభలో మాట్లాడటానికా  అని కాంగ్రెస్ వేస్తున్న ప్రశ్నలు సామాన్య జనంలోకి బలంగా  వెళ్లే అవకాశం ఉంది. 

ఎమ్మెల్యేలలోనూ అసంతృప్తే !

సభలో హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు పోరాడుతున్నప్పటికీ, కేసీఆర్ గైర్హాజరీ వారిని కొంత రక్షణలో   పడేస్తోంది. ప్రధాన నాయకుడు రణక్షేత్రంలో లేనప్పుడు, మిగిలిన నేతల వాదనలకు అంత బలం ఉండదనేది రాజకీయ సత్యం. కేసీఆర్ రాకపోవడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కూడా అసహనం వ్యక్తమవుతోంది.  కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవడం అనేది  జారిపోయిన అవకాశం  గానే కనిపిస్తోందని అంటున్నారు.తొలి రోజు సంతాప తీర్మానాల వరకూ అయినా ఉండాల్సిందన్న అభిప్రాయంతో ఉన్నారు. 

అసెంబ్లీకి వస్తే గౌరవానికి లోటు ఉండదు - మరి ఎందుకు రారు?

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవానికి లోటు రానివ్వబోమని గత ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తాం కానీ వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడబోమని కాంగ్రెస్ గట్టిగానే సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్ ను స్వయంగా కేసీఆర్ దగ్గరకు వెళ్లి పలకరించారు. ఇతర నేతలు కూడా అదే చేశారు. వ్యక్తిగతంగా కించపరచడం అనేది ఉండదన్న భావన కల్పించారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరై.. నీరు సహా ఇతర అంశాల్లో తన వాదనలు గట్టిగా వినిపించడానికి చాన్స్ ఉంది. అది బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అవుతుంది. అయినా ఎందుకు కేసీఆర్ ఆసక్తి చూపించడం లేదనేది ఆ పార్టీ నేతలకు మిస్టరీగానే ఉంది.