Isabgol Benefits in Telugu : జీవనశైలిలోని వివిధ అంశాలు జీర్ణ సమస్యలను పెంచుతాయి. దీంతో ఈ మధ్యకాలంలో చాలామంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. పెద్దల నుంచి పిల్లల వరకు ఈ సమస్య చాలా కామన్ అయిపోయింది. అయితే ఇలాంటి సమస్యలను దూరం చేసుకునేందుకు ఉన్న సహజమైన పరిష్కారాల్లో ఇసబ్‌గోల్ ఒకటి. దీనిని psyllium husk అంటారు. ఇసబ్​గోల్ అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థం. ఇది జీర్ణవ్యవస్థను సరిచేయడంలో సహాయపడుతుంది. అయితే దీనిని సరైన సమయంలో.. సరైన విధంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం అందుతుందని చెప్తున్నారు నిపుణులు. 

ఇసబ్‌గోల్ ఎప్పుడు తాగితే మంచిది

ఇసబ్​గోల్ రాత్రి పడుకునే ముందు తాగితే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే దీనిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే ఉదయం సాఫీగా మల విసర్జన జరుగుతుంది. ఇది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఉపశమనం ఇస్తుందని చెప్తున్నారు. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే.. బాడీ డీటాక్స్ అవ్వడమే కాకుండా.. జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే మీ అవసరాన్ని బట్టి దానిని ఉదయం తాగాలా? లేదా సాయంత్రం తాగాలో ఫిక్స్ చేసుకోవాలని అంటున్నారు. 

ఇసబ్​గోల్ ఎలా తాగితే మంచిదంటే.. 

1 లేదా 2 టీ స్పూన్ల ఇసబ్‌గోల్ తీసుకోవాలి. రోజులో అంతకు మించి తీసుకోకూడదు. ఈ ఇసబ్​గోల్​ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో కలిపి తాగాలి. కలిపిన వెంటనే తాగేస్తే మంచిది. లేదంటే అది జెల్‌లా మారుతుంది. ఇలా తాగిన వెంటనే మరో గ్లాస్ నీరు తాగితే ఇంకా మంచిది. లేదా ఒకసారి ఇసబ్​గోల్​ తాగితే.. తర్వాత వీలైనంత ఎక్కువ నీరు తాగాలని సూచిస్తున్నారు. లేదంటే బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మజ్జిగలో కలిపి తాగితే జీర్ణక్రియకు ఇంకా మంచిదని చెప్తున్నారు. 

ఇసబ్‌గోల్ బెనిఫిట్స్.. 

ఇసబ్​గోల్ రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండి బౌల్ మూవ్‌మెంట్ సులభం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గడంలో కూడా ఇది సహాయం చేస్తుందని చెప్తారు. అలాగే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. గ్లూకోజ్ అబ్జార్ప్షన్‌ను కంట్రోల్ చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గట్ హెల్త్ మెరుగుపరుస్తుంది.

గట్​లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే డయేరియాను తగ్గించి.. పేగులను స్థిరంగా ఉంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి.. అసిడిటీని తగ్గిస్తుంది. కడుపులో యాసిడ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇసబ్​గోల్ ఆరోగ్యానికి మంచిదే అయినా రోజుకు 1–2 టీ స్పూన్లకు మించి తీసుకోకూడదు. తాగిన తర్వాత తప్పనిసరిగా నీరు ఎక్కువగా తాగాలి. ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం రావచ్చు. దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకుంటే మరీ మంచిది. ఇసబ్‌గోల్ సరైన విధంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.