అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాధారణంగా రాత్రి లేదా మధ్యాహ్నం భోజనం చేశాక అన్నం మిగిలిపోతూ ఉంటుంది. కానీ దాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అందుకే పారేస్తూ ఉంటారు. అలా పారయకుండా ఆ అన్నంతో స్నాక్స్ చేసుకుంటే మంచిది. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అన్నంతో చేసే రైస్ బాల్స్ చేయడం కూడా చాలా సులువు. ఎలా చేయాలో ఒకసారి చూడండి. 


కావాల్సిన పదార్థాలు
అన్నం - ఒక కప్పు
కొబ్బరి తురుము - అర కప్పు
ఉల్లిపాయ - ఒకటి 
బియ్యప్పిండి - అరకప్పు
పాలకూర - ఒక కట్ట
పచ్చిమిర్చి - ఒకటి
అల్లం పేస్టు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకు సరిపడా


తయారీ ఇలా
ఉల్లిపాయలు, పాలకూర, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అన్నం వేసి అందులో బియ్యంప్పిండి, కొబ్బరి తురుము వేసి కలపాలి. వాటిలో ఉప్పు, అల్లం పేస్టు, బియ్యప్పిండి, కొబ్బరి తురుము, పాలకూర, నీళ్లు వేసి బాగా కలపాలి. మిశ్రమం గట్టిగా ఉండేలా చేసుకోవాలి. వాటిని చిన్న బాల్స్‌లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కాక ఈ బాల్స్‌ను వేసి వేయించాలి. అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.   వీటిని కెచప్ తో తింటే రుచి అదిరిపోతుంది. సాయంత్రం పూట స్నాక్స్ లా ఇవి బావుంటాయి. బ్రేక్ ఫాస్ట్ గా కూడా వీటిని తినవచ్చు. వీటిని కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు. పిల్లలకు చాలా నచ్చుతాయి ఈ రైస్ బాల్స్. 


అన్నం మిగిలిపోవడం ప్రతి ఇంట్లో జరిగేదే. అలా అన్నాన్ని రోజూ పడేయడానికి ఎంతో మందికి మనసొప్పదు. ఎన్నో ఇళ్లల్లో ఇప్పటిక అన్నాన్ని పడేయడం పాపంతో సమానం. ఎంతో మంది బయట అన్నం లేక ఇబ్బంది పడుతుంటే... మనం అన్నాన్ని పడేయడం మంచి పద్దతి కాదు. అందుకే మిగిలిపోయిన అన్నంతో చేసే వంటకాలను నేర్చుకుంటే సరి. రైస్ బాల్స్ చేసుకోవడం వల్ల కొత్త స్నాక్ తిన్నట్టు ఉంటుంది. ఇందులో  వాడే పదార్థాలు కూడా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి వీటిని తినడం మంచిదే. అయితే తరచూ డీప్ ఫ్రై చేసిన వంటకాలు తినమని మాత్రం మేము సిఫారసు చేయడం లేదు. ఇందులో వాడిన పాలకూరలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి అత్యవసరమైనది. అలాగే అల్లం పేస్టు, కొబ్బరి తురుము కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. పిల్లలకు ఇవి నచ్చడం ఖాయం. 


Also read: మానసిక ఆందోళన మితిమీరిపోయిందా? అయితే అది జబ్బే



Also read: డయాబెటిస్ ఉంటే మతిమరుపు వ్యాధి త్వరగా వచ్చేస్తుందట















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.