టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించినప్పటి నుంచి... ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు సంధిస్తూనే ఉన్నాయి. భూమన క్రిస్టియన్‌ అని, నాస్తికుడని  విమర్శలు చేస్తూనే ఉన్నారు. అన్యమతస్థుడైన కరుణాకర్‌రెడ్డికి టీడీపీ చైర్మన్‌ పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. హిందువుల మనోభావాలను వైసీపీ సర్కార్‌ దెబ్బతీస్తోందని మండిపడుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై సీరియస్‌గా స్పందించిన భూమన కరుణాకర్‌రెడ్డి... ఆరోపణలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. 17ఏళ్ల క్రితమే టీటీడీ చైర్మన్‌గా పని చేశానన్న భూమున... తాను చేసిన దైవకార్యాలే ఆరోపణలు చేసే వారికి సమాధానం చెప్తాయన్నారు. 


గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తాను ఎన్నో మంచిపనులు చేశారని చెప్పారు భూమన కరుణాకర్‌రెడ్డి. 30వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని గుర్తుచేశారు. తిరుమల ఆలయ సమీపంలోని నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం కూడా తానే తీసుకొచ్చానని చెప్పారు భూమన. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ కూడా తానేనని చెప్పుకొచ్చారు. ఇవిగాక.. దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లి కళ్యాణం చేయించానని చెప్పారు. తాను క్రిస్టియన్ అని, నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇవే తాన సమాధానాలు అని చెప్పారాయన. అయినా, ఇలాంటి ఆరోపణలకు భయపడి... మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదన్నారు భూమన. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడినని... ఇలాంటి వాటికి భయపడనని తేల్చిచెప్పారు. తిరుపతిలో జరిగిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు భూమన కరుణాకర్‌రెడ్డి. టీటీడీ చైర్మన్‌గా... మంచి కార్యాలు చూస్తూనే ఉంటానన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా... చర్యలు చేపడాతమని చెప్పారు. 


టీటీడీపై వస్తున్న ఆరోపణలపై ఈవో ధర్మారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాశాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం  చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లోనే మహతిలో పీపీటీ ప్రదర్శన ఏర్పాటు  చేస్తామన్నారు. టీటీడీపై విమర్శలు చేస్తున్న వారిలో తిరుపతి వాసులు కూడా ఉన్నారని చెప్పారాయన. టీటీడీని తిరుపతి వాసులు తమ సొంతంగా భావించాలని... దేవుడి  దయ వల్లే తిరుపతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. శ్రీవారి వల్లే తిరుపతి ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.


టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీవారి ఆలయంలో ముగ్గురు ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిసి మొత్తం 28 మందితో టీటీడీ  పాలకమండలిని ప్రకటించింది. వీరిలో తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా సుదర్శన్‌ వేణు, నెరుసు నాగసత్యం ప్రమాణం చేశారు. స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వీరితో ప్రమాణస్వీకారం చేయించారు.