ప్రాంతాలను బట్టి ఎన్నో రకాల సాంప్రదాయాలు, నమ్మకాలు ప్రజల్లో ఉన్నాయి. అలాంటి ఒక నమ్మకమే పాలు తాగిన వెంటనే బయటికి వెళ్ళకూడదు అని. పురాతన కాలం నుంచి ఈ నమ్మకం అలా ఉండిపోయింది. ఇప్పటికీ ఉత్తర భారత దేశంలో ఈ నమ్మకాన్ని పాటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.


ఎందుకు వెళ్ళకూడదు?
ప్రాచీన నమ్మకాల ప్రకారం పాలు తాగిన వెంటనే బయటకు వెళ్లడం వల్ల ప్రతికూల శక్తులు మనల్ని ఆకర్షిస్తాయని అంటారు.  కేవలం పాలే కాదు, ఏ ఆహారం అయినా తెలుపు రంగులో ఉన్నది తినడం లేదా తాగడం చేశాక బయటకు వెళ్ళకూడదు అని చెబుతారు. ఇవి ప్రతికూలతను ప్రేరేపిస్తాయని, దురదృష్టాన్ని తెస్తాయని అంటారు. ఇది ఎంతవరకు నిజమో ఎవరూ తేల్చలేకపోయారు. తెల్లటి ఆహార పదార్థాలు తిన్నాక ఓ అరగంట సేపు ఇంట్లోనే ఉండి తర్వాత వెళ్ళమని సూచిస్తున్నాయి ప్రాచీన ఆచారాలు.


మధ్యాహ్నం, రాత్రి 12 గంటల సమయంలో ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయని ప్రాచీన ప్రజల నమ్మకం. అందుకే ఆ సమయంలో పాలు లేదా తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్నాక బయటకు వెళ్లకుండా ఉండేవారట. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించి, ఇబ్బందులను తెస్తాయని వారి నమ్మకం. తెలుపు రంగు చంద్రుడిని సూచిస్తుంది. ఇది స్థిరత్వానికి, ప్రశాంతతకు చిహ్నం. అయితే తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్నాక రోడ్డు మీదకు వెళితే రాహువు వంటి ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయని జనాదరణ పొందిన ఒక నమ్మకం. అంతేకాదు హిందూ గ్రంధాల ప్రకారము రాహువు, చంద్రుడు ఇద్దరూ శత్రువులు. కాబట్టి తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్న వారిపై రాహువు ప్రభావాన్ని చూపిస్తుందని, చెడు జరిగేలా చేస్తుందని అంటారు.


సైన్స్ ఏం చెబుతోంది?
సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా పాలు తాగిన వెంటనే బయటికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే కొందరిలో లాక్టోస్ ఇంటాలరెన్స్ అనే సమస్య ఉంటుంది. ఇది ఉన్నట్టు వారికి కూడా తెలియదు. ఈ సమస్య ఉన్న వారిలో పాలల్లో ఉన్న లాక్టోజ్ ను అరిగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు తాగిన వెంటనే వాంతులు అవ్వడం లేదా విరోచనాలు కావడం వంటివి జరుగుతాయి. కాబట్టి పాలు తాగాక కాసేపు ఇంట్లోనే ఉండడం వల్ల ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకుని బయటకు వెళ్లొచ్చు. బయటికి వెళ్లాక వాంతులు, విరోచనాల వల్ల చాలా సమస్యలు వస్తాయి. సైన్స్ చెబుతున్నది ఇదే. అయితే ప్రజలు సైన్సు కన్నా తమ ప్రాచీన నమ్మకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 


Also read: తీపి పదార్థాలు తినాలన్న కోరిక పెరిగిపోతోందా? అయితే జాగ్రత్త భవిష్యత్తులో వచ్చే ముప్పు ఇదే





































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.