చాలా మందికి ఐస్ క్రీమ్ ఆల్ టైమ్ ఫేవరెట్. వేసవిలో ఎక్కువ మంది తినడానికి ఇష్టం చూపిస్తారు. కానీ కొంతమంది చల్లటి గాలుల టైమ్ లో కూడా తింటారు. అయితే వేసవి మాత్రమే ఐస్ క్రీమ్ తినేందుకు బెస్ట్ టైమ్ అని ఇది శరీరాన్ని చల్లబరుస్తుందని చెప్తారు. కానీ నిజానికి శరీర ఉష్ణోగ్రతకి ఐస్ క్రీమ్ కి ఎటువంటి సంబంధం లేదనే విషయం చాలా మందికి తెలియదు. చల్లని ఐస్ క్రీమ్ నోటికి తగలగానే చలిగా అనిపిస్తుంది. అయితే ఇది తాత్కాలిక శీతలీకరణ ప్రభావాన్ని మాత్రమే అందిస్తుంది. శరీర మొత్తం ఉష్ణోగ్రతని గణనీయంగా ఎటువంటి విధంగానూ ప్రభావితం చేయదు.
సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 36.5 నుంచి 37.5 డిగ్రీల సెల్సియస్(97.7 నుంచి 99.5 డిగ్రీల ఫారిన్ హీట్) వరకు ఉంటుంది. ఈ నియంత్రణకు బాధ్యత వహించే అవయవం మెదడులోని హైపోథాలమస్. బాహ్య ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరం చల్లబడతానికి వివిధ యంత్రాంగాలని ఉపయోగిస్తుంది. ఉదాహరణకి చెమట.
ఐస్ క్రీమ్ నిజంగానే చల్లబరుస్తుందా?
ఐస్ క్రీమ్ నోటిలోని ఉష్ణోగ్రతని తగ్గించి కాస్త ఉపశమనాన్ని అందిస్తుంది. కానీ నేరుగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించదు. నిజానికి ఐస్ క్రీమ్ లేదా ఏదైనా చల్లని ఆహారం తీసుకున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా తగ్గుదల ఎదుర్కోవాల్సి వస్తుంది. హైపోథాలమస్ నోటిలోని చల్లదనాన్ని గ్రహిస్తుంది. దీని వల్ల శరీర అంత్య భాగాలకి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. కేవలం శరీరాన్ని చల్లబరుస్తుందనేది మన ఫీలింగ్ మాత్రమే. అది ఎంత మాత్రం నిజం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఐస్ క్రీమ్ వల్ల అనార్థాలే
ఐస్ క్రీమ్ తినడం వల్ల శక్తి రాకపోగా నీరసంగా అనిపిస్తుంది. అందుకు కారణం దానిలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం అయ్యేందుకు ఎక్కువగా సమయం తీసుకుంటుంది. దీని వల్ల శక్తి అందదు. పైగా ఆలస్యంగా జీర్ణం కావడం వల్ల నిద్రకూడా సరిగా పట్టదు. ఇందులో చక్కెర, కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.
ఐస్ క్రీమ్ లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల అధికంగా శుద్ది చేసిన కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరతాయి. ఫలితంగా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. పైగా వీటిలో సంతృప్త కొవ్వులు అధికం. ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అధిక రక్తపోటు, అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు ఐస్ క్రీమ్ తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఒక కప్పు ఐస్ క్రీమ్ లో 28 గ్రాముల చక్కెర ఉంటుంది. అందుకే నోటికి రుచిగా ఉంటుంది కదా అని ఐస్ క్రీమ్ లాగించేయకండి ఇబ్బందులో పడకండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: సహజమైన చర్మ కాంతిని పొందాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Join Us on Telegram:https://t.me/abpdesamofficial