ఉసిరి చాలా ప్రత్యేకం. భారతీయులు దీన్ని దైవంగా భావిస్తారు. కొందరు ఈ మొక్కను తమ ఇళ్ళలో పెంచుకుని పూజిస్తారు. వివిధ ఔషధాలకి కూడా దీని చూర్ణం వినియోగిస్తున్నారు. ఉసిరి తినడం వల్ల కలిగే లాభాల గురించి అమ్మమ్మలు కథలు కథలుగా చెప్పేవాళ్ళు. పులుపు, చేదు రుచితో మిళితమైన ఉసిరి తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేసి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. ఇదొక సూపర్ ఫుడ్ గా వర్ణిస్తారు. బరువు తగ్గించడంలో ఉసిరి చాలా కీలకంగా వ్యవహరిస్తుంది.


బరువు తగ్గొచ్చు


ఉసిరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే దీన్ని తీసుకుంటే పొట్ట ఎక్కువ సేపు నిండుగా తృప్తిగా ఉన్న ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. జీర్ణవ్యవస్థని బలోపేతం చేసి జీవక్రియని మెరుగుపరుస్తుంది. 2017లో ఎలుకల మీద జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఉసిరి తినడం వల్ల కొవ్వు కరిగిపోతుందని తేలింది. అధిక కొవ్వుతో ఉన్న ఎలుకలు ఉసిరి తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గినట్లు తేలింది. అందుకే ఇది బరువు తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. 


రోగనిరోధక శక్తి పెంచుతుంది


ఉసిరిలో హైపోగ్లైసీమిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హైపర్గ్లైసీమిక్, యాంటీ హైపర్లిపిడెమిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, టానిన్లు, పాలీ ఫెనాల్స్, ఫైబర్స్, మినరల్స్ అధిక స్థాయిలో ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి.


ఎలా తినాలి?


తరతరాలుగా మనం ఉసిరికాయని పచ్చిగా, ఊరగాయ రూపంలో తీసుకుంటున్నాం. ఉసిరిని ఎండబెట్టుకుని పొడి(చూర్ణం) చేసుకుని కూడా తినొచ్చు.  ఈ చూర్ణంతో జ్యూస్ చేసుకుని తాగిన కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కొవ్వు కరిగి.. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఉసిరి రుచి పోకుండా తినాలని అనుకుంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కొద్దిగా ఉప్పు నంచుకుని తింటే బాగుంటుంది. చలికాలంలో ఉసిరి తినడం మరింత ఆరోగ్యకరం.


ఉసిరి జ్యూస్ ఎలా చెయ్యాలి?


రెండు ఉసిరికాయలు తీసుకోవాలి. వాటిని ముక్కలుగా కోసుకుని నీటితో కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా అయ్యేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్ వేసుకుని తాగొచ్చు. ఒకవేళ తీపి రుచి కావాలని అనిపిస్తే వాటికి బదులుగా తేనె జోడించుకోవచ్చు. అయితే దీన్ని బ్లెండ్ చేసిన వెంటనే తాజాగా ఉన్నప్పుడే తాగాలి.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి


ప్రతి మూలికా ఔషధం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ఉసిరి విషయంలో కూడా వర్తిస్తుంది. జీర్ణక్రియలో అసౌకర్యం లేదా మరేదైనా సమస్య ఉంటే దాన్ని తీసుకోవడం మానేయాలి. ఒక రోజులో ఎంత మోతాదులో తీసుకోవాలనే దాని గురించి తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి. వారి సూచనల మేరకి మాత్రమే దాన్ని తినాలి. ఉసిరికాయ తినడం వల్ల వచ్చే దుష్ప్రభావాల కేసులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ మితంగా తీసుకోవడం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: జిడ్డు చర్మం వాళ్ళు మాయిశ్చరైజర్ రాసుకోవచ్చా? ఎటువంటివి ఎంపిక చేసుకోవాలి?